Omicron: ‘ఒమిక్రాన్‌పై ‘జీరో కొవిడ్‌’ పని చేయదు.. చైనాకు ఇబ్బందులు తప్పవు’

కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. ఈ క్రమంలో స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ‘ఒమిక్రాన్‌’ విషయంలో ఈ విధానం పని చేయదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్...

Published : 26 Dec 2021 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. ఈ క్రమంలో స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ‘ఒమిక్రాన్‌’ విషయంలో ఈ విధానం పని చేయదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, వైరాలజిస్ట్ ప్రొ.తులియో డి ఒలివెరా తెలిపారు. బీటాతోపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కనుగొన్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల బృందానికి ఆయన నేతృత్వం వహించారు. తాజాగా ఆయన ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘ఒమిక్రాన్, జీరో కొవిడ్ విధానంతో చైనాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వైరస్‌ కట్టడి చర్యల కోసం ఇతర దేశాలతో కలవాల్సిన అవసరం కూడా రావొచ్చు. మరోవైపు.. ఒమిక్రాన్‌ వ్యాప్తి సాకుతో చైనా తన అధికారులను, పౌరులను, విదేశీయులను శిక్షించకూడదు’ అని రాసుకొచ్చారు.

ఇటీవల చైనాలోని జియాన్‌ నగరంలో ఒక్కరోజే 50కు పైగా కరోనా కేసులు బయటపడటంతో.. అక్కడి అధికారులు 1.3 కోట్ల జనాభాను లాక్‌డౌన్‌లోకి నెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైరస్‌ కట్టడిలో విఫలమయ్యారనే కారణంతో 26 మంది అధికారులపై వేటు పడింది. ఈ పరిణామాల నడుమ.. తాజాగా ఒలివెరా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహమ్మారి నియంత్రణలో విఫలమైన అధికారులను మందలించడం, తొలగించడం వంటి చర్యలు చైనా కొంతకాలంగా చేపడుతూనే ఉంది. ఇటీవల ఇన్నర్‌ మంగోలియాలో, అంతకుముందు జెంగ్‌జౌలోనూ ఉన్నతాధికారులను తొలగించింది. ఫిబ్రవరిలో వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ నేపథ్యంలో చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని