Mekedatu: వరుస కరోనా కేసులు..కర్ణాటకలో ‘మేకెదాటు’ పాదయాత్ర నిలిపివేత

కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ‘మేకెదాటు’ పాదయాత్రను నిలిపేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర భాజపా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే, ఇందులో పెద్దఎత్తున కరోనా కేసులు...

Published : 13 Jan 2022 15:10 IST

బెంగళూరు: కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ‘మేకెదాటు’ పాదయాత్రను నిలిపేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో భాజపా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే, ఇందులో పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తదితరులకు తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, బెంగళూరు మాజీ మేయర్ మల్లికార్జున్‌, ఎమ్మెల్యే లక్ష్మి తదితరులకూ లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో.. పాదయాత్రను నిలిపేస్తున్నట్లు పార్టీ నేతలు గురువారం ప్రకటించారు. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత పునః ప్రారంభిస్తామని చెప్పారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వందలాదిమంది ఈ ర్యాలీలో పాల్గొంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. భాజపా నేతలు దీన్ని ‘సూపర్ స్ప్రెడర్’ ర్యాలీగా అభివర్ణిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా 60 మందిపై కేసులూ నమోదయ్యాయి. స్థానికంగా కరోనా పరిస్థితుల దృష్ట్యా.. ఈ ర్యాలీని వెంటనే ఆపాలంటూ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై.. కాంగ్రెస్‌కు లేఖ సైతం రాశారు. ఇదిలా ఉండగా.. ఈ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇచ్చారని? దాన్ని ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ర్యాలీకి అనుమతి తీసుకున్నారా? కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలనూ ప్రశ్నించింది. ఇరుపక్షాలు శుక్రవారంలోగా వివరణ ఇవ్వాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని