CoronaVirus: అగ్రరాజ్యంలో తిరగబెడుతున్న కరోనా.. ఒక్కరోజే లక్షన్నర కేసులు!

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ.......

Updated : 04 Aug 2021 18:50 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం  ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే ఉంటున్నట్టు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

ఈ నగరాల్లోనే రికార్డుస్థాయిలో కేసులు
ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1,49,788 ఇన్‌ఫెక్షన్లు బయటపడగా.. మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. అలాగే, తాజాగా మరో 668మంది మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్‌ కాటుకు బలైపోయినవారి సంఖ్య 6.14లక్షలకు చేరింది. 

తాజా ఉద్ధృతికి కారణమిదే.. 

అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియెంట్‌ వ్యాప్తి చెందడమే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ కేసుల పెరుగుదలతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత జోరందుకుంది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30లక్షల మందికి టీకా ఇచ్చినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన 70శాతం మందికి కనీసం ఒక్కడోసు అందించారు. అలాగే, ఇప్పటివరకు ఒక్కడోసు కూడా పూర్తికాని దాదాపు 9కోట్లమందికి త్వరలోనే వ్యాక్సిన్‌ వేయించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, వ్యాక్సినేషన్‌ను మరింతగా ప్రోత్సహించేలా ఇటీవల బైడెన్‌ కొత్త ప్రణాళికను కూడా రాష్ట్రాలకు ప్రతిపాదించారు. వ్యాక్సిన్‌ వేయించుకుంటే 100 డాలర్లు ప్రోత్సాహకంగా ఇవ్వాలని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మళ్లీ నిబంధనలు అమలు

దేశంలో మళ్లీ కేసులు భారీగా వస్తుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్‌ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. గతంలో కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో మాస్క్‌ అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు తాజాగా మాస్క్‌లు, భౌతికదూరం నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాకుండా న్యూయార్క్‌ సిటీలో ఆగస్టు 16 నుంచి రెస్టారెంట్లు, జిమ్‌లు వంటి ఇండోర్‌ కార్యక్రమాలకు వెళ్లే వారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సిందేనని మేయర్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని