Corona: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్‌ మృత్యు ఘంటికలు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా......

Updated : 13 Aug 2021 18:34 IST

ఒక్కరోజే 7లక్షల కేసులు.. 10వేల మరణాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. గడిచిన 24గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి దాదాపు 10వేల మందికి పైగా మృత్యువాతపడగా.. 7లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. అమెరికా, బ్రిటన్‌, ఇరాన్‌ సహా పలు దేశాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి ఆందోళనకరంగా మారుతోంది. ఒక్క అమెరికాలోనే నిన్న దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదు కాగా.. ఇరాన్‌లో 39వేలకు పైగా కేసులు, 568 మరణాలు వెలుగుచూశాయి. ఇకపోతే, బ్రిటన్‌లోనూ దాదాపు 33వేల మందికి కొవిడ్‌ సోకింది. జులై 23 తర్వాత తొలిసారి నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అక్కడి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మందికి వైరస్‌ సోకగా.. 43,35,111మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5కోట్ల మందికి పైగా కోలుకున్నారు.

మరోవైపు, డెల్టా వేరియంట్‌ విజృంభణ కారణంగానే తమ దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నట్టు బ్రిటన్‌ వైద్యాధికారులు చెబుతున్నారు. ఆ దేశంలో  ప్రస్తుతం 60శాతం మంది వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకోగా.. మిగిలిన వారికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ అందించాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో సిడ్నీలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్‌కు అడ్డుకట్టవేయడంలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అదనపు మిలటరీ సిబ్బందిని కూడా రంగంలోకి దించుతున్నట్టు న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  డెల్టా వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తిచెందుతోందని.. దీన్ని కట్టడి చేసేందుకు గురువారం సాయంత్రం నుంచి వారం పాటు అమలు చేయనున్నట్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని