Corona Updates: బెంగళూరుపై ఒమిక్రాన్‌ పంజా.. దిల్లీలో2500మంది పోలీసులకు కొవిడ్‌!

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఒమిక్రాన్‌ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ విజృంభిస్తోంది......

Updated : 17 Jan 2022 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఒమిక్రాన్‌ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా పలు రాష్ట్రాలు చర్యలు తీసుకొంటున్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితిపై కొన్ని అప్‌డేట్స్‌.. 

బెంగళూరులో ఒకేరోజు 287 ఒమిక్రాన్‌ కేసులు

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో భారీగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ ఒక్కరోజే 287 కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 766కి పెరిగిందన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లోనూ భారీగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 85 కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 


దిల్లీలో 2500మంది పోలీసులకు కరోనా

దిల్లీలో కరోనా ఉగ్రరూపం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇటీవల గరిష్ఠస్థాయిలో నమోదైన కేసుల సంఖ్య గణనీయంగా దిగి వస్తోంది. అయితే, జనవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది పోలీసులు కొవిడ్‌ బారిన పడినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ (క్రైం) చిన్మోయ్‌ బిశ్వాల్‌ కూడా కొవిడ్‌ బారిన పడగా ఆయన కోలుకొని ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఆయనతో పాటు దాదాపు 767 మంది సిబ్బంది కొవిడ్ నుంచి కోలుకొని విధులకు వస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, దిల్లీ పోలీసులు అన్ని ర్యాంకుల సిబ్బంది కోసం బూస్టర్‌ డోసు అందించేందుకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. దిల్లీలో దాదాపు 80వేలకు పైగా పోలీసు సిబ్బంది ఉన్నట్టు దిల్లీ పోలీస్‌ పీఆర్వో వెల్లడించారు. 


ఒడిశాలో 982మంది చిన్నారులకు కొవిడ్‌

ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 688 కేసులు తగ్గినప్పటికీ పిల్లలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో 982 మంది చిన్నారులు కొవిడ్‌ బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు  గడిచిన 24గంటల వ్యవధిలో 70,117 టెస్టులు చేయగా.. 10,489 కొత్త కేసులు వెలుగుచూశాయి. అలాగే, కొవిడ్‌ బాధితుల్లో 4452మంది ఆదివారం కోలుకోగా.. ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఖుర్దాలో 24,764 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


తమిళనాట విద్యార్థులకు 100శాతం తొలి డోసు పూర్తి

వ్యాక్సినేషన్‌లో తమిళనాడు కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులందరికీ తొలిడోసు పూర్తయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్‌ వెల్లడించారు. మరోవైపు, దేశంలో జనవరి 3నుంచి ఇప్పటివరకు 3.5కోట్ల మందికి పైగా టీనేజర్లకు తొలి డోసు పూర్తయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. 


కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వాయిదా

తిరువనంతపురం: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వాయిదా వేసింది. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు జరగాల్సిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని