Vaccination: 15-18 ఏళ్ల వారికి కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభం

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఈ వయసు వారికి వ్యా్క్సినేషన్‌ కోసం జనవరి 1 నుంచి

Updated : 03 Jan 2022 12:31 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఈ వయసు వారికి వ్యాక్సినేషన్‌ కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొవిన్‌ యాప్‌ డేటా ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది కౌమారులు టీకా కోసం పేరు నమోదు చేసుకున్నారు. వీరికి నేటి నుంచి డోసుల పంపిణీ చేపట్టారు. ఆధార్‌ కార్డు లేని పిల్లలు స్టూడెంట్‌ ఐడీ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సూచించారు. దీంతో అన్ని రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ముంబయిలో 9 జంబో సెంటర్లు ఏర్పాటు చేశారు. అస్సాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. టీనేజీ పిల్లలకు టీకా డ్రైవ్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ ప్రారంభమైంది.

ప్రస్తుతం ఈ వయసు వారందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందించనున్నారు. తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసును వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రి వెల్లడించారు. 2007, అంతకంటే ముందు జన్మించినవారు టీకా వేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోసు..

దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పరిధిని విస్తరిస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా అందించనున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. దీంతో పాటు జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ప్రికాషన్‌ డోసును పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రికాషన్‌ డోసుగా ఏ వ్యాక్సిన్‌ వేస్తారన్నది మాత్రం కేంద్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇటీవల కేంద్రం ఆమోదించిన కార్బివాక్స్‌, కొవొవాక్స్‌లను ముందు జాగ్రత్త డోసుగా పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

90% పైగా అర్హులకు తొలి డోసు 

ఇక దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ.. ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన, భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో ఒకటని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. గత ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు దేశంలో అర్హులైనవారిలో 90% మందికి పైగా తొలి డోసు, 65% మందికి రెండు డోసులు అందాయని వెల్లడించింది. భారత్‌లో వ్యాక్సినేషన్‌ గురితప్పిందంటూ వచ్చిన కొన్ని వార్తాకథనాలు ఏమాత్రం సరికావని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ గురి తప్పిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ ఒకటి ఇటీవల కథనాన్ని ప్రచురించింది. అది తప్పుదోవ పట్టించేలా ఉంది’’ అని అందులో పేర్కొంది. ‘‘అభివృద్ధి చెందిన చాలా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌ టీకా కార్యక్రమం ఎక్కువగా విజయవంతమైంది. తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ పూర్తిచేశాం. అర్హులైన పౌరులకు తొలిడోసు అందించడంలో అమెరికా     (73.2%), బ్రిటన్‌ (75.9%), ఫ్రాన్స్‌ (78.3%), స్పెయిన్‌ (84.7%)తో పోలిస్తే భారత్‌దే (90% పైగా) ముందంజ. రెండోడోసు  విషయంలోనూ  ముందున్నాం.’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని