ఇరాన్‌ కీలక నిర్ణయం..!

అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలిగింది....

Updated : 06 Jan 2020 16:01 IST

టెహ్రాన్‌: అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధన నుంచి సైతం విరమించుకుంటామని ప్రకటించింది. ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాటి నుంచి ఇరాన్‌ సైతం ఒక్కో నిబంధనను అతిక్రమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నట్లు ప్రకటించింది. చివరగా యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం పక్కనపెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక తమ దేశ అణు కార్యక్రమంపై ఎలాంటి పరిమితులు లేవని ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా నిర్ణయంతో అణు ఒప్పందం నుంచి ఇరాన్‌ పూర్తిగా బయటకు వచ్చినట్లైంది. ఈ చర్య వల్ల యురేనియం శుద్ధి, శుద్ధి స్థాయి, ఎంత మొత్తంలో శుద్ధి చేయాలి, అణు పరిశోధన వంటి అంశాల్లో ఇరాన్‌పై ఇక ఎలాంటి పరిమితులు ఉండబోవు. అయితే ప్రస్తుతానికి విద్యుత్తు ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల మేరకే తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ‘అంతర్జాతీయ అణుశక్తి సంఘం’(ఐఏఈఏ)తోనూ తమ సహకారం కొనసాగుతుందని వెల్లడించింది. 

ఇరాన్‌ నిర్ణయాన్ని ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, చైనా విచారం వ్యక్తం చేశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపునకు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు మూడు దేశాల అధినేతలు చర్చలు జరిపినట్లు జర్మనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతానికి ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇరాన్‌ కీలక నిర్ణయం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సైతం స్పందించింది. దీనిపై ఇరాన్‌ విదేశాంగ మంత్రితో మరింత లోతుగా చర్చిస్తామని తెలిపింది.

అణ్వస్త్ర పాటవాన్ని ఇరాన్‌ సముపార్జించకుండా నిలువరించే సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శాశ్వత సభ్య దేశాలు అయిదింటితో పాటు జర్మనీ, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ప్రతినిధులు, టెహ్రాన్‌ నేతలు కలిసికట్టుగా 2015లో రూపొందించారు. ఈ ఒప్పందం ప్రకారం అణు పదార్థ శుద్ధి, శుద్ధి స్థాయి తదితరల అంశాలపై పరిమితులు ఉంటాయి. కానీ, ఈ ఒడంబడిక ఇరాన్‌కు అనుకూలంగా.. అమెరికాకు ఇబ్బందికంగా ఉందని ఆరోపిస్తూ ట్రంప్ 2018లోనే దీన్నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై కఠిన ఆర్థిక-వాణిజ్య ఆంక్షల కొరడా ఝుళిపిస్తూ వచ్చారు.   

ఇవీ చదవండి..

ఖర్చులిస్తేనే కదులుతాం: ట్రంప్‌
అమెరికా తప్పుటడుగులు
పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని