
ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత
మస్కట్: ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన నేతగా పేరుగాంచిన ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు. 1970తో తన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇప్పటి వరకు సుల్తాన్‌గా కొనసాగారు. చురుకైన విదేశీ విధానంతో ఒమన్‌ని ఆధునికత వైపు నడిపించిన నేతగా ఆయనకు పేరుంది. ఆరు దేశాలతో ఇరాన్‌కు కుదిరిన అణు ఒప్పందంలో ఖబూస్ నేతృత్వంలోని ఒమన్.. ఉభయపక్షాల మధ్య మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఒమన్‌కి ప్రాధాన్యం పెరిగింది.
వారసుడిపై సందిగ్ధత...
ఖసూస్ బ్రహ్మచారి కావడం, సొంత సోదరులెవరూ లేకపోవడంతో ఆయన వారసుడు ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఒమన్ రాజ్యాంగం ప్రకారం సుల్తాన్ పదవి ఖాళీ అయిన మూడు రోజుల్లోగా కొత్తవారు సింహాసనాన్ని అధిష్ఠించాలి. రాజకుటుంబం నుంచైనా లేదా వారు సూచించిన వారైనా సుల్తాన్‌గా బాధ్యతలు స్వీకరించాలి. లేనిపక్షంలో రాజకుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఖబూస్ రాసిన లేఖలో పేర్కొన్న వ్యక్తిని సుల్తాన్‌గా నియమిస్తారు. ఒమనీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించి, రాజకుటుంబానికి చెంది, తగిన అర్హతలున్న వ్యక్తిని తదుపరి సుల్తాన్‌గా ఎన్నుకుంటారు. ఈ నిబంధనల ప్రకారం దాదాపు 80 మంది పోటీలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అసద్ బిన్ తారిఖ్ పేరుగా గట్టిగా వినిపిస్తోంది. 65ఏళ్ల తారిఖ్ 2017లో ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.