భారత్‌లో కరోనా కేసులు@415

మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది.

Published : 23 Mar 2020 11:33 IST

దిల్లీ: మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో నానాటికీ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల నుంచి 18,383 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఈ వైరస్‌పై పరిశోధనలు ముమ్మరం చేసిన ఐసీఎంఆర్‌, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ రెండవ దశలోనే ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే, ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొవిడ్‌-19 దశపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేనప్పటికీ కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతుండటం దీనికి బలం చేకురుతోంది. దేశంలో కరోనా వైరస్‌ దశపై మరికొన్ని రోజుల్లో ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతటి కీలక సమయంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహించడంతోపాటు పలు రాష్ట్రాలు ఈనెల 31వరకు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. దీంతో దేశంలోని దాదాపు 80ప్రధాన పట్టణాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా ఈ కేసుల సంఖ్య 89కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

కరోనా నుంచి కోలుకున్నవ్యక్తి మృతి..

కొవిడ్‌-19 బారినపడిన 68ఏళ్ల వ్యక్తి కోలుకున్న అనంతరం చనిపోయిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఫిలిప్పైన్స్‌ నుంచి భారత్‌ వచ్చిన వ్యక్తికి తొలుత కరోనా సోకినట్లు నిర్ధారించారు. కొన్నిరోజుల అనంతరం ఈ వైరస్‌ నుంచి కోలుకున్నట్లు ప్రకటించగా తాజాగా గత రాత్రి ఆ వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ముంబయిలో కొవిడ్‌-19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. 

అత్యవసర మార్గం ద్వారా పైలెట్‌ బయటకు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్‌ లక్షణాలున్న వారు కూడా ప్రయాణాలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు రైళ్లలో ఇలాంటివారు ప్రయాణాలు చేస్తుండగా గుర్తించి వారిని మధ్యలోనే దించివేసిన సంఘటనలు చూశాం. తాజాగా విమానంలో ప్రయాణించి ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడం ఆందోళనకు గురిచేసింది. పుణె నుంచి దిల్లీ బయలుదేరిన ఎయిర్‌ఏసియా విమానంలో ప్రయణించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లు విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన వెంటనే ఆ విమానాన్ని దూరంగా నిలిపివేశారు. ఈ సమయంలో పైలట్‌ అత్యవసర మార్గం ద్వారా బయటకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం విచారణ జరిపిన అధికారులు, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్‌ అలా వ్యవహరించారని ఏయిర్‌ఏసియా పేర్కొంది. అయితే కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తిని కూడా మరో ప్రత్యేకమార్గం ద్వారా బయటకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తికి కొవిడ్‌-19 నిర్ధారణ కాలేదని వైద్యులు ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మార్చి 20వ తేదీన జరిగినట్లు ఏయిర్‌ఏసియా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని