దిల్లీ: 102మందిలో 52మందికి కరోనా పాజిటివ్‌!

కరోనా వైరస్‌ మహమ్మారి దేశ రాజధాని దిల్లీని వణికిస్తోంది. నిజాముద్దీన్‌ ఘటన అనంతరం దిల్లీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత అత్యధిక పాజిటివ్‌ కేసులు దిల్లీలో నమోదవుతున్నాయి.

Published : 11 Apr 2020 16:35 IST

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశ రాజధాని దిల్లీని వణికిస్తోంది. నిజాముద్దీన్‌ ఘటన అనంతరం దిల్లీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత అత్యధిక పాజిటివ్‌ కేసులు దిల్లీలో నమోదవుతున్నాయి. సెంట్రల్‌ దిల్లీలోని చాంద్‌నీ మహల్‌ ప్రాంతంలో కరోనా సోకి ముగ్గురు మరణించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశానికి హాజరై దాదాపు 13ప్రార్థనా మందిరాల్లో నివాసమున్న 102మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా వీరిలో 52మందికి కరోనా నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. తాజాగా వీరిలో ముగ్గురు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన చాలా మందికి వైరస్‌ సోకే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సీల్ చేసిన అధికారులు ప్రజలు ఇంటినుంచి బయటకురాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దిల్లీలో ఒకేరోజు దాదాపు 200 కొవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదుకావడంతో నగరంలో 30 హాట్‌స్పాట్‌లను గుర్తించి సీల్‌ చేశారు.

లాక్‌డౌన్‌ పొడగించాలన్న కేజ్రీవాల్‌..

దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30వరకు పొడగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూచించారు. ఈ రోజు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సడలింపు అంశం రాష్ట్రాలకే వదిలేస్తే అది కచ్చితంగా అమలుకాదన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే మాత్రం రైలు, రోడ్డుతోపాటు అన్ని రకాల రవాణా వ్యవస్థలను అనుమతించవద్దని ప్రధానికి సూచించారు.

ఇదిలా ఉంటే, దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 903కి చేరగా 13మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 450మంది తబ్లిగీలకు సంబంధించినవారే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారంనాటికి దేశవ్యాప్తంగా కరోనా సోకి 239మంది మరణించగా మొత్తం 7447మంది దీని బారినపడ్డారు. గడచిన 24గంటల్లోనే దేశంలో కొత్తగా 40మరణాలు, 1035కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 16లక్షల మందికి ఈ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో లక్షమంది మృతిచెందారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 239 మరణాలు, 7447 కేసులు

101 రోజులు...1,02,136 మరణాలు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని