Corona: ఆయుధాల్లేకుండా యుద్ధమెలా!

కారాగారాల్లో రద్దీ తగ్గించే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల అమలు కోసం పనిచేస్తున్న లాయర్లు, న్యాయాధికారుల్లో 18-44 ఏళ్ల వయసు

Updated : 14 May 2021 10:27 IST

టీకాలు ఇవ్వకుండా లాయర్లను ఎలా పంపగలం?
జైళ్లలో రద్దీ తగ్గింపు అంశంపై దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు 

దిల్లీ: కారాగారాల్లో రద్దీ తగ్గించే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల అమలు కోసం పనిచేస్తున్న లాయర్లు, న్యాయాధికారుల్లో 18-44 ఏళ్ల వయసు వారు నేరుగా టీకాలను పొందే వీలుందా అని దిల్లీ హైకోర్టు ఆరా తీసింది. ‘తుపాకీ ఇవ్వకుండా యుద్ధానికి ఎలా పంపగలమ’ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించింది. సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాల అమలు కోసమే వారు పనిచేస్తున్నారని జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం గుర్తుచేసింది. జిల్లా కోర్టుల్లోని టీకా కేంద్రాల్లో న్యాయాధికారులు, న్యాయ సహాయం అందించే లాయర్లకు తక్షణం టీకాలు ఇచ్చేలా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దిల్లీ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే టీకాల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి న్యాయవాదులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా వర్గీకరించలేదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ చెప్పారు. న్యాయ సాయం అందించే లాయర్లకు టీకా వేసే అంశం దిల్లీకే కాకుండా దేశం మొత్తానికీ సంబంధించిందన్నారు. టీకా రెండు డోసుల మధ్య దాదాపు నెల విరామం ఉంటుందని, ఆ సమయంలో సదరు న్యాయవాదులకు కొవిడ్‌-19 ముప్పు పొంచి ఉంటుందని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘‘మీరు చెప్పింది నిజమే. అయితే ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ న్యాయవాదులు మొదటి డోసు పొందినా కొంత ఉపశమనం ఉంటుంది కదా? వారికి మనం కనీసం ఇవ్వగలిగింది ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించింది.

దిల్లీ ప్రభుత్వ న్యాయవాది సంతోశ్‌ కె త్రిపాఠి మాట్లాడుతూ.. 45 ఏళ్లు పైబడ్డ న్యాయవాదులు, న్యాయాధికారులు జిల్లా కోర్టుల్లోని టీకా కేంద్రాలకు నేరుగా వచ్చి టీకాలు పొందొచ్చని చెప్పారు. 18-44 ఏళ్ల వయసు వారికి ఈ వెసులుబాటు లేదన్నారు. వీరికి నేరుగా టీకా వేసేందుకు అనుమతిచ్చే అధికారం దిల్లీ ప్రభుత్వానికి లేదని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని చెప్పారు. న్యాయవాదులకు టీకాల ఇచ్చేందుకు ఒక ప్రముఖ న్యాయ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. టీకా కార్యక్రమం ఒక జాతీయ విధానం ప్రకారం నడుస్తుంటే సదరు న్యాయ సంస్థ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ ఎలా చేయగలుగుతోందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘‘మా ఉద్దేశం ఆ సంస్థను నిలువరించడం కాదు. వారు ఎలా చేయగలుగుతున్నారో తెలుసుకొని, దాన్ని ఈ కేసుకు వర్తింపచేయవచ్చా అన్నది పరిశీలించాలనుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించింది. టీకాల కోసం న్యాయవాదుల జాబితాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సమర్పించింది. ఈ జాబితాను రూపొందించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. జైళ్లకు వెళ్లి.. బెయిలుకు దరఖాస్తు చేసేందుకు ఖైదీల అనుమతిని కోరేందుకు న్యాయ సేవా లాయర్లు, ఈ కేసులను విచారించే న్యాయాధికారులు చాలా ప్రత్యేక తరగతికి చెందినవారని నాటి విచారణలో కోర్టు వ్యాఖ్యానించింది. తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వారు ఇళ్లకే పరిమితమైతే.. జైళ్లలో రద్దీని తగ్గించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎవరు అమలు చేస్తారని ప్రశ్నించింది.

టీకాలు లేనప్పుడు ‘చిరాకెత్తించే’ ఆ డయలర్‌ టోన్‌ ఎందుకు?

ప్రజలు టీకాలు వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ డయలర్‌ టోన్‌పై దిల్లీ హైకోర్టు మండిపడింది. ‘‘సెల్‌ఫోన్‌తో ఎవరికైనా కాల్‌ చేసినప్పుడు ‘చిరాకెత్తించే’ ఈ సందేశం వస్తోంది. సరిపడా వ్యాక్సిన్లు లేనప్పటికీ ఈ సందేశాన్ని ఇస్తున్నారు’’ అని జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీకాలే లేనప్పుడు ప్రజలు వాటిని ఎలా పొందగలరని ప్రశ్నించింది. ‘‘వ్యాక్సిన్లను అందరికీ ఇవ్వాలి. డబ్బు తీసుకొనైనా అందించాలి. చిన్నపిల్లలను అడిగినా అదే చెబుతున్నారు’’ అని వ్యాఖ్యానించింది. ఒకటే సందేశం కాకుండా మరిన్ని సందేశాలను పెట్టాలని సూచించింది. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, టీకాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్నపాటి టీవీ కార్యక్రమాలను రూపొందించాలని యాంకర్లకు సూచించింది. వాటిని అన్ని చానళ్లలో ప్రసారం చేయాలంది. ఇందుకోసం అమితాబ్‌ బచ్చన్‌ వంటి ప్రముఖుల సాయం తీసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని