Afghanistan Crisis: తాలిబన్ల అంతు చూస్తాం: పంజ్‌షేర్‌

దేశాన్ని ఆక్రమించి.. తమవైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని పంజ్‌షేర్‌ సైనికులు తేల్చి చెప్పారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, వారి అంతు చూస్తామని ..

Updated : 27 Aug 2021 10:38 IST

కాబుల్‌: దేశాన్ని ఆక్రమించి.. తమవైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని పంజ్‌షేర్‌ సైనికులు తేల్చి చెప్పారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, వారి అంతు చూస్తామని ప్రకటించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఉత్తర కూటమితో అఫ్గానిస్థాన్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలాగే.. అఫ్గాన్‌ ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. పొరుగుదేశం తజకిస్థాన్‌ సైతం పంజ్‌షేర్‌ సైనికులకు మద్దతు పలికింది.

రిపోర్టర్‌ను కొట్టిన తాలిబన్లు
అఫ్గానిస్థాన్‌ వార్తాసంస్థ టోలో పాత్రికేయుడు జియార్‌ యాద్‌ ఖాన్‌ తాలిబన్ల చేతుల్లో మరణించారనే వార్తలు కాసేపు కలకలం రేపాయి. టోలో న్యూస్‌ కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరించింది. అయితే.. తాను మరణించలేదని, ఆ వార్తలు అవాస్తవాలని జియార్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించడంతో అనిశ్చితి తొలగిపోయింది. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని.. తన వద్ద ఉన్న కెమెరాలు, ఫోను, ఇతర సాంకేతిక పరికరాలను లాక్కున్నట్లు జియార్‌ తెలిపారు.

తీవ్రమైన ఆహార సంక్షోభం
కరవు, కొవిడ్‌-19 వంటి విపత్తులకు తోడు ఇటీవల నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో మహా మానవ సంక్షోభానికి దారితీస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ఫుడ్‌ రిలీఫ్‌ ఏజెన్సీ పేర్కొంది. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అప్గానిస్థాన్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరు (దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు 20 లక్షల పిల్లలు తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. వారికి వెంటనే వైద్యం అవసరమని నివేదిక పేర్కొంది. దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో అఫ్గాన్‌లో గోధుమల ధరలు గత నెల రోజుల్లోనే 25 శాతం పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని