Updated : 03 Nov 2021 12:12 IST

Cop26: భూతాపం నుంచి ద్వీప దేశాలను రక్షించేందుకు ‘ఐరిస్‌’

‘కాప్‌26’ సదస్సులో ప్రారంభించిన మోదీ

గ్లాస్గో: వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతులను కల్పించేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ రెజీలియంట్‌ ఐలాండ్‌ స్టేట్స్‌’ (ఐరిస్‌) అనే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సు (కాప్‌26) వేదిక వద్ద లాంఛనంగా ప్రారంభించారు. వాతావరణ మార్పులతో పెను ముప్పును ఎదుర్కొంటున్న ఈ దేశాలకు దీని వల్ల మేలు జరుగుతుందని, కొత్త ఆశలను చిగురింపజేస్తుందని ఆకాంక్షించారు. ఆ దేశాలకు ఎంతో కొంత సాయం చేస్తున్నామన్న సంతృప్తిని ఇది మిగిలిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు హాజరయ్యారు.

‘‘కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదు. అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాల (ఎస్‌ఐడీఎస్‌)కు అది జీవన్మరణ సమస్యగా మారింది. ఆ ప్రాంతాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అక్కడ ప్రజల ప్రాణాలకే కాక ఆర్థిక వ్యవస్థలకూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ దీవులకు పర్యాటక రంగమే ఆధారం. అయితే విపత్తులకు జడిసి అక్కడికి వెళ్లడానికి పర్యాటకులు వెనుకడుగు వేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొందరి స్వార్థం వల్ల ప్రకృతికి సంబంధించిన వికృత రూపం తెరపైకి వచ్చింది. దీనివల్ల అభం శుభం తెలియని చిన్న ద్వీప దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి’’ అని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇస్రో ద్వారా విపత్తు సమాచారం
‘విపత్తును ఎదుర్కొనే మౌలిక వసతుల కూటమి’ (సీడీఆర్‌ఐ)ని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. పసిఫిక్‌ దీవులు, కారికోమ్‌ దేశాలతో సహకారం కోసం భారత్‌ ప్రత్యేక ఏర్పాటు చేసిందన్నారు. ఉపగ్రహాల సాయంతో సకాలంలో తుపాను హెచ్చరికలు చేయడానికి, పగడపు దిబ్బలు, తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ వివరాలను ఆయా దేశాలకు అందిస్తామని చెప్పారు. ఐరిస్‌ను ప్రారంభించిన మోదీని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామన్నారు.

భారత వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలి
కాప్‌26 సదస్సు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మధ్య జరిగిన స్వల్పకాల చర్చల్లో.. ఉగ్రవాదంపై పోరు, కొన్ని వేర్పాటువాద సంస్థలు సాగిస్తున్న అతివాద కార్యకలాపాలు సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వ్యతిరేక వేర్పాటువాద ముఠాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని జాన్సన్‌ పేర్కొన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించే అంశంపై ఈ స్వల్ప భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదని శ్రింగ్లా తెలిపారు. ఈ అంశంపై ఇరు దేశాల భద్రత సలహాదారులు బుధవారం భేటీ కానున్నట్లు వెల్లడించారు.

ఏమిటీ ఐరిస్‌?
సీఆర్‌డీఐలో భాగంగా ఐరిస్‌ను చేపట్టారు. దీనికింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో తలెత్తే ముప్పులపై మదింపు వేస్తారు. వీటిని తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్య పెంపునకు ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్ల ఇది సాధ్యమైంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని