పులుల అభయారణ్యాల జోలికి పోవద్దు

పులులు, ఇతర వన్యమృగాల అభయారణ్యాలలో జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు, పులుల వీక్షణానికి (టైగర్‌ సఫారీ) సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సవరించాలని లేదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార సంఘం (సీఈసీ) సిఫార్సు చేసింది.

Updated : 08 Feb 2023 05:42 IST

కేంద్ర సాధికార సంఘం సిఫార్సు

దిల్లీ: పులులు, ఇతర వన్యమృగాల అభయారణ్యాలలో జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు, పులుల వీక్షణానికి (టైగర్‌ సఫారీ) సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సవరించాలని లేదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార సంఘం (సీఈసీ) సిఫార్సు చేసింది. ఈ సంఘం గత నెలలో తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ పులుల అభయారణ్యంలో టైగర్‌ సఫారీ ప్రతిపాదనను పురస్కరించుకుని ఈ సంఘం కీలక సిఫార్సులు చేసింది. పులుల అభయారణ్యాల అంచుల్లో, తటస్థ ప్రాంతాల్లో పులల సఫారీలను నిర్వహించవచ్చని జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ 2012లో మార్గదర్శకాలు విడుదల చేసింది. అనంతరం 2016, 2019 సంవత్సరాల్లో వాటిని సవరించింది. కానీ, ఈ మూడు సంవత్సరాల్లో జారీ చేసిన మార్గదర్శకాలు, సవరణలను ఉపసంహరించాలనీ లేదా పులుల సంరక్షణకు అనువుగా మళ్లీ సవరించాలని సీఈసీ సూచించింది. పులులు, ఇతర వన్యమృగాల అభయారణ్యాలలో, జాతీయ పార్కుల్లో, వన్య మృగాలు తిరిగే ప్రాంతాలలో జంతుప్రదర్శనశాలలు కూడా ఏర్పాటు చేయకూడదని పేర్కొంది. పర్యాటకం పేరుతో ఈ ప్రాంతాల్లోకి చొరబడితే ఇప్పటికే అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న పులులు, ఇతర వన్యమృగాల ఉనికికి ముప్పువాటిల్లుతుందని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని