సంక్షిప్త వార్తలు(12)

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీపై గతంలో జారీ చేసిన రెడ్‌ నోటీసును ఇంటర్‌పోల్‌ ఉపసంహరించింది.

Updated : 21 Mar 2023 09:16 IST

ఛోక్సీపై రెడ్‌ నోటీసు ఉపసంహరణ

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీపై గతంలో జారీ చేసిన రెడ్‌ నోటీసును ఇంటర్‌పోల్‌ ఉపసంహరించింది. ఛోక్సీ చేసిన విజ్ఞప్తి మేరకు తమ డేటాబేస్‌ నుంచి రెడ్‌ నోటీసును ఉపసంహరించినట్లు లియాన్‌ కేంద్రంగా పనిచేసే ఈ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ పరిణామంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పందించలేదు.  2018లో ఇంటర్‌పోల్‌ ఛోక్సీపై రెడ్‌ నోటీసు జారీ చేసింది. అంతకు 10 నెలల ముందే ఆయన దేశం విడిచి పారిపోయారు.


భారత్‌కు బంగ్లా రేవులు.. ప్రతిపాదించిన షేక్‌ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌, సిల్హెట్‌ ఓడ రేవులను భారత్‌ అవసరమైతే వినియోగించుకోవచ్చని బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనా ప్రతిపాదించారు. ఛటోగ్రామ్‌ రేవు భారత ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలో ఉంటుంది కాబట్టి, అది ఈశాన్య ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తుంది. తమ రేవుల ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వర్ధిల్లుతాయనీ, రెండు దేశాల మధ్య రవాణా అనుసంధానం పెరుగుతుందనీ హసీనా అన్నారు. ఇండియా ఫౌండేషన్‌కు చెందిన రామ్‌ మాధవ్‌ ఆదివారం ఇక్కడ హసీనాతో ఆమె అధికార నివాసం గణభవన్‌లో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో హసీనా భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. హసీనా నాయకత్వంలో బంగ్లా ఆర్థికంగా, సామాజికంగా పురోగమించిందంటూ రామ్‌ మాధవ్‌ హర్షం వ్యక్తంచేశారు.


ఇమ్రాన్‌ ఖాన్‌ మేనల్లుడి అరెస్టు

అవినీతి కేసులో మాజీ ప్రధాని భార్యకు సమన్లు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ మేనల్లుడు హసన్‌ నియాజిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అవినీతి కేసు విచారణకు సంబంధించి ఇమ్రాన్‌ శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అనుచరులు భద్రతా దళాలపై దాడికి దిగి తీవ్ర విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. హసన్‌తోపాటు మరికొందరు ఇమ్రాన్‌ అనుచరులనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో శనివారం నుంచి ఇప్పటివరకూ అరెస్టయిన ఇమ్రాన్‌ అనుచరుల సంఖ్య 198కి చేరింది. మరోవైపు ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబి మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పాక్‌ అవినీతి నిరోధక శాఖ(నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు సోమవారం లాహోర్‌లోని ఇమ్రాన్‌ నివాసానికి వచ్చి బుష్రా బీబీకి నోటీసులు అందజేశారు. ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చిన కానుకలను సొంత లబ్ధి కోసం అమ్ముకున్నట్లు ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే బుష్రా బీబీకి నోటీసులు అందాయి.  


సోనియా సలహామండలిలో పనిచేసిన హర్ష మందర్‌ ఎన్జీవోపై సీబీఐ!

దిల్లీ: మానవ హక్కుల కార్యకర్త, రచయిత హర్ష మందర్‌ ఏర్పాటు చేసిన ఎన్జీవో సంస్థ అమన్‌ బిరాదరీపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసింది. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో పనిచేసిన జాతీయ సలహా మండలిలో మందర్‌ సభ్యుడిగా వ్యవహరించారు. ‘‘లౌకిక, శాంతియుత, న్యాయ, మానవ ప్రపంచం కోసం ప్రజల ప్రచారం’’ భావనతో ఆయన అమన్‌ బిరాదరీని ఏర్పాటు చేశారు.


డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి.. ప్రభుత్వ ఉద్యోగి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. తపాలా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సురేంద్ర కుమార్‌ దీక్షిత్‌ ఓ కార్యక్రమంలో స్నేహితులతో కలసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు రావడం వల్లే మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడాకు ఊరట

బెయిలును పొడిగించిన సుప్రీంకోర్టు

వేర్వేరు చోట్ల నమోదైన మూడు కేసులూ లఖ్‌నవూకు బదిలీ

దిల్లీ: ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడాకు స్వల్ప ఊరట లభించింది. ఆయనపై వేర్వేరు చోట్ల నమోదైన మూడు కేసులను కలిపి ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలోని హజరత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఖేడా మధ్యంతర బెయిలును వచ్చే నెల 10 వరకు పొడిగించింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖేడా ఫిబ్రవరి 17న ముంబయిలో ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని భాజపా నేతలు ఆరోపించారు.


పార్లమెంటు పనిచేయొద్దనుకుంటున్నారు

జైరాం రమేశ్‌

రాజ్యసభలో విపక్ష ఎంపీలు కనీసం తమ సీట్లలో ఇంకా కూర్చోకముందే భాజపా సభ్యులు పెద్దఎత్తున నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఫలితంగా సభ వెంటనే వాయిదా పడుతోంది. పార్లమెంటు పనిచేయొద్దని మోదీ సర్కారు కోరుకుంటున్నట్లు దీనిద్వారా  అర్థమవుతోంది.   


అదానీ గ్రూప్‌ను ఇంకెన్నాళ్లు వెనకేసుకొస్తారు?

ప్రియాంక చతుర్వేది

రూ.34,900 కోట్ల విలువైన పెట్‌కెమ్‌ ప్రాజెక్టు పనులను అదానీ గ్రూప్‌ అర్ధంతరంగా సస్పెండ్‌ చేసింది. ఆ ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలంటూ విక్రయదారులు, సరఫరాదారులకు మెయిళ్లు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ఆ గ్రూప్‌ను వెనకేసుకొస్తుంది? దాన్నుంచి ఎంతకాలంపాటు ప్రజల దృష్టిని మళ్లిస్తుంది?  


మోదీ అలా.. రాహుల్‌ ఇలా..

తేజస్వీ సూర్య

మోదీ స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ భారత్‌ గురించి మాట్లాడుతున్నారు. మెరుగైన రహదారులు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు ఇస్తామంటున్నారు. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిస్తున్నారు. కానీ రాహుల్‌ గాంధీయేమో కర్ణాటకలో.. యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామంటున్నారు. నేటి యువత ఆకాంక్షలకు కాంగ్రెస్‌ ఎంత దూరంగా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం.       


మెదళ్లకు పదును పెట్టుకుంటే సరిపోదు

దలైలామా

చిన్నారులు పాఠశాలల్లో కేవలం తమ మెదళ్లకు పదును పెట్టుకుంటే సరిపోదు. అలా చేస్తే వారు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులకు కారణం కాబోరని చెప్పలేం. అత్యంత ఉత్సుకతతో కూడిన ఆ మెదళ్లకు సహృదయం తోడవ్వాలి. వారు ఎంత కరుణామయులుగా మారితే.. సమాజానికి ఉపయోగపడేవారిగా ఎదిగేందుకు అవకాశాలు అంతగా మెరుగవుతాయి.


మహారాష్ట్రలో గో సేవా కమిషన్‌ ఏర్పాటు

ముంబయి: హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి భాజపా పాలిత రాష్ట్రాల మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గో సేవా సంఘ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం 24 మంది సభ్యులతో గోవుల సేవా కమిషన్‌ ఏర్పడనున్నది. ఈ సంఘం 2015లో పశు మాంస ఎగుమతుల నిషేధానికి తెచ్చిన చట్టాన్ని తు.చ తప్పకుండా అమలుచేస్తుంది. పాడి ఆవుల సంరక్షణ, వట్టిపోయిన ఆవుల మదింపునకు చర్యలు తీసుకుంటుంది. రూ.10 కోట్ల నిధితో గో సేవా సంఘాన్ని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఈ వారంలోనే శాసన సభలో ప్రవేశపెడుతుంది. వట్టిపోయిన ఆవులను సంరక్షించే గోశాలలకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి గో సేవా కమిషన్‌ కు అధికారమిచ్చారు. గో రక్షణకు కొత్త పథకాలనూ చేపడుతుంది. మెరుగైన గోజాతుల వృద్ధికి పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. గోమూత్రం, పేడల నుంచి బయోగ్యాస్‌, విద్యుదుత్పాదనకు పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తుంది.


నీతీశ్‌ పీఎం కావాలనుకోవడం లేదు.. నేను సీఎం కావాలనుకోవడం లేదు

తేజశ్వీ యాదవ్‌ వాఖ్య

పట్నా: నీతీశ్‌ కుమార్‌ ప్రధాని కావాలనుకోవడం లేదని, తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నామని సోమవారం శాసనసభలో చెప్పారు. ఆ సమయంలో ఆయన పక్కనే నీతీశ్‌ కుమార్‌ ఉన్నారు. తేజశ్వీని ముఖ్యమంత్రిగా చూడాలంటూ ఆర్జేడీ నేతలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నీతీశ్‌తో విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తేజశ్వీ వ్యాఖ్యలు అవేవీ లేవనే సంకేతాలిచ్చాయి.


వైయక్తిక, పార్లమెంటు చట్టాల మధ్య వివాదం వస్తే ఏది చెల్లుబాటవుతుంది?

విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

దిల్లీ: ముస్లిం వైయక్తిక చట్టం (పర్సనల్‌ లా) ప్రకారం యుక్తవయసుకు వచ్చిన 15 ఏళ్ల బాలిక వివాహం చేసుకోవడానికి అర్హురాలు. కానీ, ప్రత్యేక వివాహ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం కనీస వివాహ వయసు.. యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21ఏళ్లు. అయితే, ఈ రెండు చట్టాల మధ్య వివాదం తలెత్తితే...ఏ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ వివాదంపై విచారణ జరపనున్నట్లు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం సోమవారం వెల్లడించింది. 16 ఏళ్ల బాలికను ముస్లిం యువకుడు ప్రేమ వివాహం చేసుకోగా అతనిపై ఆమె తండ్రి కిడ్నాప్‌ కేసు నమోదు పెట్టారు. దీనిపై బాలిక అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి తన ఇష్టప్రకారమే పెళ్లి జరిగినందున కిడ్నాప్‌ కేసు కొట్టివేయాలని కోరింది. అందుకు నిరాకరించిన న్యాయస్థానం మైనర్‌ బాలిక పెళ్లి చట్ట ప్రకారం చెల్లదని పేర్కొంటూ ఆమెను ప్రభుత్వ వసతి గృహానికి పంపించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆ బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లిం వైయక్తిక చట్టం ప్రకారం యుక్తవయసుకు వచ్చిన 15 ఏళ్ల బాలిక వివాహానికి అర్హురాలేనని తెలిపింది. ఇలాంటి కేసు గతంలోనూ సుప్రీంకోర్టుకు వచ్చిందని బాలిక తరఫు న్యాయవాది దుష్యంత్‌ పరాశర్‌ తెలిపారు. ఈ కేసులో బాలిక తరఫున అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


విమానయాన సంస్థలకు ప్రామాణిక నిర్వహణ నిబంధనలు నిర్దేశించాలి

సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన మూత్ర విసర్జన బాధితురాలు

దిల్లీ: గత నవంబరులో ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడి దౌష్ట్యానికి గురైన 72 ఏళ్ల మహిళ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన శంకర్‌ మిశ్రాకు జనవరి 31న దిల్లీ కోర్టు లక్ష రూపాయల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి పూచీకత్తు మీద బెయిలు ఇచ్చింది. ఈ ఘటనలో తన పట్ల బాధ్యతగా వ్యవహరించడంలో విఫలమైన ఎయిరిండియా యాజమాన్యానికీ, పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ)కీ ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను నిర్దేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని మహిళా పిటిషనర్‌ అభ్యర్థించారు. డీజీసీఏతో పాటు పౌర విమానయాన శాఖ కూడా ప్రయాణికుల పట్ల అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలను పాటించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. విమానాల్లో ప్రయాణించే పౌరులందరి ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అభ్యర్థిస్తున్నట్లు పిటిషనర్‌ చెప్పారు. ఎయిరిండియా విమానాల్లో 2014 నుంచి తాగుబోతు ప్రయాణికులు గలాటా చేయడం, మరుగుదొడ్డిలో ధూమపానం చేయడం, సహ ప్రయాణికుల మీద మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆమె గుర్తుచేశారు.


సీయూఈటీ-పీజీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ట్వీట్‌ ద్వారా వెల్లడించిన యూజీసీ ఛైర్మన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష-2023 (సీయూఈటీ)కి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో వెల్లడించారు. దరఖాస్తు రుసుంను డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో పాటు నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా ఆన్‌లైన్లో చెల్లించవచ్చని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు.

ముఖ్య తేదీలివే..

దరఖాస్తుల స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 19 సాయంత్రం 5గంటల వరకు

ఆన్‌లైన్‌లో రుసుం చెల్లింపు: ఏప్రిల్‌ 19 రాత్రి 11.50 గంటల వరకు

దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు గడువు: ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు

* అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష తేదీ తదితర అంశాలను తర్వాత ప్రకటిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు