ఆ తాగుబోతుతో పెళ్లొద్దు.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు

వరుడికి పెళ్లి మండపంలోనే షాకిచ్చింది ఓ వధువు. వివాహ సమయానికి వరుడు మద్యం తాగి ఉండటాన్ని గమనించి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది.

Updated : 23 May 2023 05:42 IST

ఈటీవీ భారత్‌: వరుడికి పెళ్లి మండపంలోనే షాకిచ్చింది ఓ వధువు. వివాహ సమయానికి వరుడు మద్యం తాగి ఉండటాన్ని గమనించి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోగా చివరకు పెళ్లినే రద్దు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో జరిగిందీ ఘటన. చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. సాయంత్రం ఊరేగింపుగా ముందుగా బుక్‌ చేసుకున్న ఫంక్షన్‌ హాల్‌కు వరుడు, అతడి బంధువులు చేరుకున్నారు. కాసేపటికే వధువు తన స్నేహితులతో కలిసి వేదికపైకి వచ్చింది. వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే సమయానికి వరుడి ఫ్రెండ్స్‌.. పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేశారు. అప్పటికే వారు మద్యం సేవించి ఉండటంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వరుడి మెడలో దండ వేస్తుండగా అతడూ మద్యం సేవించి ఉన్నాడని వధువు గమనించింది. వెంటనే వేదికపై నుంచి దిగి ఫంక్షన్‌ హాల్‌లోని ఓ గదిలోకి వెళ్లిపోయింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు