‘కవచ్‌’ ఉండి ఉంటే.. కోరమాండల్‌ ప్రమాదంతో తెరపైకి భద్రతా వ్యవస్థ

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదంతో అందరి దృష్టి ఇప్పుడు ‘కవచ్‌’పైకి మళ్లింది. రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్‌ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు.

Published : 04 Jun 2023 03:21 IST

ఈనాడు, దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదంతో అందరి దృష్టి ఇప్పుడు ‘కవచ్‌’పైకి మళ్లింది. రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్‌ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు. అది ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏమిటీ కవచ్‌?

రైళ్లు సురక్షితంగా నడవడానికి ‘కవచ్‌’ అనే ఈ వ్యవస్థను రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌వో) సొంతంగా రూపొందించింది. ఇందులో మూడు భారతీయ సంస్థలూ పాలుపంచుకున్నాయి. ఇందుకు రూ.16.88 కోట్లు ఖర్చయింది. 

* ఈ వ్యవస్థలో ఎలక్ట్రానిక్‌, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ పరికరాలు ఉంటాయి. వీటిని రైలు ఇంజిన్లు, పట్టాలు, సిగ్నలింగ్‌ వ్యవస్థ, ప్రతి స్టేషన్‌లో ఏర్పాటుచేస్తారు. జీపీఎస్‌ వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ వ్యవస్థ నిరంతరం రైళ్ల కదలికలను గమనిస్తూ సంకేతాలు పంపుతూ ఉంటుంది.

* రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ (రైలు డ్రైవర్‌) రైలును ముందుకు నడిపినప్పుడు (సిగ్నల్‌ పాస్డ్‌ ఎట్‌ డేంజర్‌- ఎస్‌పీఏడీ) ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోవడానికి ఇలాంటి హెచ్చరిక లేకపోవడమే ప్రధాన కారణం. అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ.. లోకో పైలట్‌ను అప్రమత్తం చేసి, బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. అదే లైన్‌లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే.. ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసి ఆపేస్తుంది. ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తిచేస్తుంది.

* సిగ్నల్‌ను విస్మరించినప్పుడే కాకుండా పరిమితికి మించి వేగంగా ప్రయాణించకుండా కూడా ఈ వ్యవస్థ చూస్తుంది. అలాంటి సందర్భాల్లో బ్రేక్‌లు వేసి వేగాన్ని నియంత్రిస్తుంది.

* దట్టమైన పొగమంచు ఆవరించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైలు సాఫీగా, భద్రంగా నడవడానికి సాయపడుతుంది. ఇందుకోసం క్యాబిన్‌లో సిగ్నల్‌ను ప్రదర్శిస్తుంది. రైలు వేగంగా వెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

* రైలు లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్దకు చేరువవుతున్నప్పుడు ఈ వ్యవస్థ తనంతట తానుగా అప్రమత్తం చేస్తుంది.

* ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని రైళ్లకు అత్యవసర సందేశం పంపి, వాటిని అప్రమత్తం చేస్తుంది. 

అందుబాటులో ఉన్నది 2.21% మార్గంలోనే

కవచ్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అది ఇంకా దేశవ్యాప్తం కాలేదు. ప్రస్తుతం దేశంలో 65,114 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్‌గేజ్‌ మార్గం ఉండగా ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 1,465 కిలోమీటర్ల మార్గాన్ని (2.21%) మాత్రమే కవచ్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. మిగతా చోట్ల దాన్ని దశలవారీగా అమలుచేయాలని నిర్ణయించారు.

* దిల్లీ-ముంబయి మార్గంలో 3,000 కిలోమీటర్లు, దిల్లీ-హావ్‌డా మార్గంలోని 1,165 కిలోమీటర్ల పరిధిలో ‘కవచ్‌’ ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచారు. తదుపరి గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌, గోల్డెన్‌ డయాగ్నల్‌ రూట్‌లో 6,000 కిలోమీటర్ల మేర కవచ్‌ ఏర్పాటుకు సర్వే, డీపీఆర్‌ తయారీ పనులు జరుగుతున్నాయి.


సికింద్రాబాద్‌ డివిజన్‌లో స్వయంగా పరీక్షించిన రైల్వే మంత్రి

2022 మార్చి 4న ఈ పరికరాన్ని సికింద్రాబాద్‌ డివిజన్‌లోని గుల్లగూడ-చిట్‌గిడ్డ స్టేషన్ల మధ్య ప్రయోగించి చూశారు. ఇందులో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌ త్రిపాఠీలు ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ప్రయాణించి ప్రత్యక్షంగా దాని పనితీరును పరీక్షించారు.


కవచ్‌ ఉన్నా కాపాడేది కాదు

వందేభారత్‌ రూపకర్త సుధాన్షు మణి వ్యాఖ్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే కవచ్‌ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించడం సాధ్యమయ్యేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వందేభారత్‌ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కవచ్‌ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదేమో. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే... ఇది సిగ్నలింగ్‌ వైఫల్యంగా కనిపించడం లేదు. తొలి రైలు పట్టాలు తప్పడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మొదటి రైలు ఎలా పట్టాలు తప్పిందనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలి’ అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా అతివేగంతో వెళ్తున్నందున కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ బ్రేకులు వేయలేకపోయారని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని