Pratap singh Rane: కాంగ్రెస్‌ నేతకు జీవితకాల కేబినెట్‌ హోదా ప్రకటించిన భాజపా

కాంగ్రెస్​ సీనియర్, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ ​సింగ్​ రాణే(87)కు జీవితకాలం కేబినెట్​ హోదా ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.....

Published : 07 Jan 2022 19:54 IST

పనాజీ: కాంగ్రెస్​ సీనియర్ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ ​సింగ్​ రాణే(87)కు జీవితకాలం కేబినెట్​ హోదా ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ గురువారం వెల్లడించారు. రాష్ట్రానికి ప్రతాప్ ​సింగ్​ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ హోదా ఇస్తున్నట్లు వెల్లడించారు. నాలుగుసార్లు గోవాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణే.. ప్రస్తుతం పోరియం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కేబినెట్‌ హోదా ప్రకటించిన నేపథ్యంలో ప్రమోద్​ సావంత్​ మీడియాతో మాట్లాడుతూ.. ‘గోవా రాష్ట్రానికి విశేష సేవలందించిన ప్రతాప్​ సింగ్​ రాణేకు జీవితకాలం కేబినెట్​ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. ముఖ్యమంత్రిగా, స్పీకర్​గా ప్రతాప్​ సింగ్​ సేవలు అందించారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగానూ వెల్లడించారు. ఎమ్మెల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ స్పీకర్లకు అలాంటి హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిందని ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు.

ప్రభుత్వ ప్రకటనపై ప్రతాప్ ​సింగ్​ రాణే కుమారుడు, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి (భాజపా) విశ్వజిత్​ రాణే హర్షం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసిన ఓ వ్యక్తిని ఇంతకంటే ఘనంగా గౌరవించలేమని పేర్కొన్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్​ చేశారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని