Israel-Palestine: ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశంపై కేంద్రం గందరగోళం: శరద్‌పవార్

ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంలో కేంద్రం వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తప్పుబట్టారు.

Published : 28 Oct 2023 15:41 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌- పాలస్తీనా (Israel-Palestine) అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ (Sharad Pawar) అన్నారు. ఇలాంటి పరిస్థితులను గత ప్రభుత్వాల్లో తానెప్పుడూ చూడలేదని తెలిపారు. హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌కు  పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ (pm Modi) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. విదేశాంగశాఖ ప్రకటన అందుకు భిన్నంగా ఉండటాన్ని శరద్‌పవార్‌ ప్రస్తావించారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాలస్తీనాకు మద్దతివ్వడమే భారత్‌ విధానమని చెప్పారు.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల తర్వాత అక్టోబర్‌ 8న ప్రధాని మోదీ స్పందిస్తూ.. హమాస్‌ ఉగ్రవాదుల నరమేధం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌కు భారత్‌ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఆయన మాట్లాడారు. అక్కడికి నాలుగు రోజుల తర్వాత భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ ఇదే విషయంపై స్పందిస్తూ.. సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనా నిర్మాణానికి భారత్‌ మద్దతిస్తుందని ప్రకటించారు. ఇలా కేంద్రం వేర్వేరు ప్రకటనలు చేయడాన్ని శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. పాలస్తీనాలో వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారన్న ఆయన.. గతంలో ఇజ్రాయెల్‌ పోరాటానికి భారత్‌ ఎప్పుడూ మద్దతివ్వలేదని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని శరద్‌పవార్‌ తప్పుబట్టారు. కీలక సమయాల్లో మౌనం వహించడం సరికాదన్నారు. ఇజ్రాయెల్‌ దాడులపై కేంద్రం వైఖరిని శరద్‌పవార్‌ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదు. గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతిదాడులు తీవ్రతరం చేసిన తర్వాత ఆయన స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు భారత్‌ మద్దతుపలకడం దురదృష్టకరమన్నారు.

షాక్‌కు గురయ్యా: ప్రియాంక గాంధీ

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటంపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ వార్త విని షాక్‌కు గురైనట్లు చెప్పారు. వేలాదిమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతుంటే.. భారత్‌ తన విధానాలకు విరుద్ధంగా మౌనంగా ఉండటం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘‘ గాజాలో కాల్పుల విరమణకోసం ఐక్యరాజ్యమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్‌ దూరంగా ఉందని తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యం, అహింస అనేవి భారతదేశానికి మూలస్తంభాలు. వాటికోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ తన గళం వినిపిస్తే.. వాళ్లంతా నైతిక ధైర్యాన్నిస్తారు. అలాంటిది.. ప్రస్తుతం పాలస్తీనాలో సాధారణ ప్రజలకు ఆహారం, నీరు, వైద్యసామగ్రి, విద్యుత్‌ అందకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటోంది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకించకుండా మౌనంగా నిలబడటం సమంజసం కాదు’’ అని ప్రియాంకగాంధీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని