Haryana: ఆ మంత్రి నన్ను జిమ్‌లో చూశారు.. ఇంటికి రమ్మని అసభ్యంగా ప్రవర్తించారు!

హరియాణా క్రీడాశాఖ మంత్రిపై జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనను ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Published : 31 Dec 2022 01:20 IST

చండీగఢ్‌: హరియాణా క్రీడాశాఖ మంత్రి, భాజపా నేత సందీప్‌ సింగ్‌ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. మంత్రిపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించారు. గురువారం రోజున ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్ పార్టీ ‌(ఐఎన్‌ఎల్‌డీ)కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మంత్రిపై లైంగిక ఆరోపణలు చేయగా.. ఆయన వాటిని ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

పోలీసులకు మహిళ ఫిర్యాదు.. 

ఈ క్రమంలోనే శుక్రవారం చండీగఢ్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ)ను కలిసి ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు మీడియాకు వెల్లడించారు. తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అన్ని విషయాలూ బహిర్గతం చేస్తారన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. హరియాణా బిడ్డనైన తనకు ప్రభుత్వం తగిన సమయం ఇస్తుందని, తన ఆవేదనను వింటుందన్న విశ్వాసం ఉందన్నారు. అలాగే, తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అథ్లెటిక్స్‌ జూనియర్‌ కోచ్‌ మంత్రిపై ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు ధ్రువీకరించారు. 

ఇన్‌స్టాలో చూశారు.. కలుద్దామని మెసేజ్‌ చేశారు.. 

గురువారం మంత్రిపై చేసిన అనేక ఆరోపణల్ని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన భాజపా నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ హాకీ కెప్టెన్‌, పెహోవా భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన సందీప్‌సింగ్‌ తొలిసారి తనను జిమ్‌లో చూశారని.. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్టు అయ్యారని మహిళ పేర్కొన్నారు. ఆ తర్వాత కలవాలని పట్టుబట్టారన్నారు. తన జాతీయ క్రీడల ధ్రువపత్రాలు పెండింగ్‌లో ఉన్న విషయంలో కలిసేందుకు ఇంటికి రావాలని ఇన్‌స్టాలో మెసేజ్‌ పెట్టారని మహిళ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు తన సర్టిఫికేట్లు ఫెడరేషన్‌ పొరపాటు వల్ల పోయాయని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్తే.. తన పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించారు. 

మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలని విపక్షాలు పట్టు!

ఈ ఆరోపణలపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. అవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టిపారేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలన్నారు. తన పరవు దెబ్బతిన్నందున ఈ అంశంపై విచారణ జరుపుతామని చెప్పారు. ఆ మహిళకు సంబంధించిన జీవితాన్నంతా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ ఘటనతో మంత్రిపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా స్పందించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం తక్షణమే మంత్రి సందీప్‌సింగ్‌ను ప్రభుత్వం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్‌ఎల్‌డీ డిమాండ్‌ చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని