Delhi Riots: వాయువ్య దిల్లీలో హైఅలర్ట్‌!

హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా వాయువ్య దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆదివారం కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు....

Updated : 17 Apr 2022 12:53 IST

ఉత్తరాఖండ్‌లోనూ అప్రమత్తమైన పోలీసులు

దిల్లీ: హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా వాయువ్య దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆదివారం కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 9 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గాయపడ్డవారిలో పోలీసులతో పాటు పౌరులు కూడా ఉన్నారు.

* మరోవైపు దిల్లీలో ఘర్షణల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆదివారమూ పలు ప్రాంతాల్లో మతపరమైన ర్యాలీలు ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి గొడవ జరిగినా వెంటనే స్పందించి జనం గుమికూడకుండా జాగ్రత్తపడాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేశారు.

* ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో శోభాయాత్ర ఊరేగింపులోనూ శనివారం ఘర్షణలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు వాహనాలను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పు కూడా పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని