Environment Day: భారీస్థాయిలో కర్బన ఉద్గారాలకు ఆ దేశాలే కారణం : మోదీ

వాతావరణ మార్పుల్లో మన పాత్ర అంతగా లేనప్పటికీ పర్యావరణ పరిక్షణకు మాత్రం భారత్‌ తీవ్ర కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Updated : 05 Jun 2022 16:33 IST

‘సేవ్‌ సాయిల్‌ ఉద్యమం’ కార్యక్రమంలో భారత ప్రధాని

దిల్లీ: వాతావరణ మార్పుల్లో మన పాత్ర అంతగా లేనప్పటికీ పర్యావరణ పరిక్షణకు మాత్రం భారత్‌ తీవ్ర కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశాలు వనరులను భారీ స్థాయిలో దోపిడి చేస్తూ అత్యధికంగా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సద్గురు జగ్గీవాసుదేవ్‌ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘సేవ్‌ సాయిల్‌ (Save Soil) ఉద్యమం’ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ క్రమంలో పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్‌ కలపాలనే లక్ష్యాన్ని భారత్‌ ఐదు నెలల ముందుగానే  సాధించిందని ప్రధాని మోదీ ప్రకటించారు.

‘పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం 2014లో 2శాతం ఉండగా.. ప్రస్తుతం దాన్ని 10 శాతానికి తీసుకువచ్చాం. దీంతో 27లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించాం. తద్వారా రూ.40వేల కోట్ల విదేశీ మారక నిల్వలను ఆదా చేయగలిగాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా శిలాజేతర ఇంధనాలతో 40శాతం విద్యుదుత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా తొమ్మిదేళ్ల ముందుగానే సాధించామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో 20వేల చదరపు కి.మీ అటవీ విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేసిన ఆయన.. వీటివల్ల అటవీ జంతువుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇక భూసారంపై రైతులకు అవగాహన లేకపోయేదని.. కానీ, ఈ సమస్యను అధిగమించడంతోపాటు భూసారంపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేసిందన్నారు.

ఇదిలాఉంటే, భూమి తన సారాన్ని కోల్పోతున్న నేపథ్యంలో దానిని మెరుగుపరచడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్ ‘సేవ్‌ సాయిల్‌ ఉద్యమాన్ని’ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 27 దేశాల్లో 100 రోజులపాటు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 75వ రోజు (జూన్‌ 5న )న దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని మోదీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని