Ladakh Standoff: మళ్లీ నోరుపారేసుకున్న డ్రాగన్‌.. దీటుగా బదులిచ్చిన భారత్‌

వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ చైనా చేసిన ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. డ్రాగన్‌ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే

Published : 01 Oct 2021 15:21 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ చైనా చేసిన ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. డ్రాగన్‌ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని దుయ్యబట్టింది. రెండు దేశాల సరిహద్దుల వెంట చైనా సైన్యమే నిరంతరంగా భారీ మోహరింపులకు దిగుతోందని, దానికి ప్రతిస్పందనగానే భారత దళాలు అప్రమత్తమయ్యాయని తెలిపింది. 

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ బుధవారం బీజింగ్‌లో మాట్లాడుతూ భారత్‌పై నోరుపారేసుకున్నారు. లద్దాఖ్‌ సరిహద్దుల్లో గతేడాది నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు మూలకారణం దిల్లీనే అని, వాస్తవాధీన రేఖను దాటి వచ్చి చైనా భూభాగాన్ని భారత్‌ ఆక్రమిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన భారత్.. డ్రాగన్‌కు గట్టిగానే బదులిచ్చింది. 

‘‘చైనా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం, నిరాధారమైనవి. సరిహద్దుల వెంబడి చైనా  సైన్యం నిరంతరం భారీగా బలగాలను మోహరిస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెట్టి రెచ్చగొట్టే చర్యలు, ఏకపక్ష నిర్ణయాలకు దిగుతోంది. చైనా చర్యలకు ప్రతిస్పందనగానే భారత్‌ కూడా బలగాలను మోహరిస్తోంది. చైనా వల్లే తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతోంది’’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను సడలించేందుకు కుదిరిన అవగాహనకు లోబడి చైనా ఇంకా పలు చర్యలు తీసుకోవాల్సి ఉందంటూ సెప్టెంబరు నెల ప్రారంభంలో దుషాంబేలో జరిగిన భేటీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపిన విషయాన్ని ఆరిందమ్‌ మరోసారి గుర్తు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని