Corona: 3వేల పైనే కొత్త కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 3వేల పైనే నమోదవ్వగా.. క్రియాశీల కేసులు 17వేలు దాటడం కలవరపెడుతోంది.

Published : 29 Apr 2022 09:44 IST

దిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 3వేల పైనే నమోదవ్వగా.. క్రియాశీల కేసులు 17వేలు దాటడం కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,73,635 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,377 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగానే పెరిగినప్పటీకీ రోజువారీ పాజిటివిటీ రేటు 0.71శాతానికి చేరడం గమనార్హం.

ఇదే సమయంలో 2,496 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.74శాతంగా ఉంది. ఇక, కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,801 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. నిన్న మరో 60 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5.23లక్షల మందిని కరోనా బలితీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గురువారం మరోర 22.80లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇప్పటివరకు 188.65కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

5-12 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీపై నేడు నిర్ణయం

దేశంలోని 5-12 ఏళ్ల చిన్నారులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈమేరకు ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో 5-12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. కాగా నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగానే ఆ వయసు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని