Nand Mulchandani: సీఐఏ మొట్టమొదటి సీటీఓగా భారత సంతతి వ్యక్తి నియామకం

అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో తాజాగా మరొకరు చేరారు. అమెరికా గూఢచార సంస్థ ‘సీఐఏ’ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ...

Published : 01 May 2022 23:40 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో తాజాగా మరొకరు చేరారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. మూల్‌చందానీకి సిలికాన్ వ్యాలీతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (డీఓడీ)లో పాతికేళ్లకుపైగా పనిచేసిన అనుభవం ఉంది. 1979-1987 మధ్య దిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్‌లో ఆయన విద్యాభ్యాసం సాగింది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, గణితంలో పట్టా పొందారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, హార్వర్డ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. కొత్త స్థానానికి నియమితులయ్యే ముందువరకు ఆయన డీవోడీ జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌కి యాక్టింగ్ డైరెక్టర్‌, సీటీఓగా పనిచేశారు.

ఒరాకిల్‌ కొనుగోలు చేసిన ఓబ్లిక్స్, వీఎంవేర్‌ సొంతం చేసుకున్న డిటర్మినా, సిస్కో చేతుల్లోకి వెళ్లిన ఓపెన్‌ డీఎన్‌ఎస్‌ తదితర అనేక విజయవంతమైన స్టార్టప్‌లకు మూల్‌చందానీ సహ-స్థాపకుడిగా, సీఈవోగా ఉన్నారు. సీఐఏ బృందంలో నంద్‌ చేరడంపై సంస్థ డైరెక్టర్‌ బర్న్స్ హర్షం వ్యక్తం చేశారు. ‘సీఐఏలో కొత్త సీటీఓ పోజిషన్‌ చాలా ముఖ్యమైనది. అత్యాధునిక ఆవిష్కరణలను ఏజెన్సీ ఉపయోగించుకునేలా మూల్‌చందానీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ కీలకమైన స్థానానికి ఆయన విస్తృత అనుభవాలను వినియోగించుకుంటాం’ అని చెప్పారు. మూల్‌చందానీ స్పందిస్తూ.. సీటీఓగా సీఐఏలో చేరడం గౌరవంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్‌, సామర్థ్యాలను అందిస్తున్న అద్భుత సాంకేతిక నిపుణులు, డొమైన్ నిపుణుల బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని