సౌమ్య కుటుంబానికి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి పరామర్శ

ఇటీవల ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యా సంతోష్‌ కుటుంబీకులను

Published : 19 May 2021 11:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యా సంతోష్‌ కుటుంబీకులను ఆ దేశ అధ్యక్షుడు రెవెన్‌ రివ్లిన్‌  పరామర్శించారు. బుధవారం ఆయన కేరళలలోని సౌమ్య కుటుంబానికి ఫోన్‌ చేశారు. సౌమ్య మృతికి సంతాపం తెలిపారు. సౌమ్య కుటుంబంతో మాట్లాడిన విషయాన్ని రెవ్లిన్‌ సలహాదారులు ఒకరు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఇప్పటికే భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబారి రోన్‌ మల్కా.. సౌమ్య కుటుంబానికి ఫోన్‌ చేసి ఓదార్చారు. సౌమ్య 9 ఏళ్ల కుమారుడికి తల్లిలేని లోటు తీర్చలేనిదని ఆమె వ్యాఖ్యానించారు.  ఆమె మృతికి ఇజ్రాయెల్‌ బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుమారుడిని చూస్తే తనకు ముంబయిపై గతంలో జరిగిన ఉగ్రదాడిలో తల్లదండ్రులను కోల్పోయిన మోషె గుర్తుకొస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ డిప్యూటీ  రాబారి రోని యెడిడియ ట్వీట్‌ చేస్తూ.. సౌమ్య మృతికి పరిహారం ఇవ్వడంతోపాటు ఆ కుటుంబ బాధ్యతలను ఇజ్రయెల్‌ అధికారులు స్వీకరిస్తారని హామీ ఇచ్చారు.

 సౌమ్య మరణ వార్తను తమ తొమ్మిదేళ్ల కుమారుడు ఏడన్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని ఆమె భర్త సంతోష్‌ తెలిపారు. అమ్మ ఫోన్‌ కోసం కుమారుడు ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడని చెప్తూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఇజ్రాయెల్‌ నుంచి కేరళకు శాశ్వతంగా వచ్చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగానే తన భార్య దుర్మరణం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతదేహాన్ని కేరళకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని