ISRO: మేఘ-ట్రోపికస్‌-1 ఉపగ్రహం కూల్చివేత.. ఇస్రో ఆపరేషన్‌ సక్సెస్‌..

మేఘ-ట్రోపికస్‌-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని పసిఫిక్‌ మహాసముద్రంపై విజయవంతంగా కూల్చివేసినట్టు  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం రాత్రి ప్రకటించింది.

Updated : 07 Mar 2023 22:23 IST

దిల్లీ:  భారత గగనతల చరిత్రలో ఉత్కంఠ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇస్రో(ISRO) ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది.  ఓ ఉపగ్రహాన్ని భారత్‌ పూర్తి నియంత్రిత విధానంలో సేఫ్‌గా మహా సముద్రంపై కూల్చివేసింది. మేఘ-ట్రోపికస్‌-1(ఎంటీ-1) ఉపగ్రహాన్ని పసిఫిక్‌ మహాసముద్రంపై విజయవంతంగా కూల్చివేసినట్టు  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం రాత్రి ప్రకటించింది.  ఈ ఉపగ్రహం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని.. ఆ తర్వాత  పసిఫిక్ మహాసముద్రంలో విచ్ఛిన్నమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ ప్రయోగాన్ని విజయంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

చైనా ఉపగ్రహాలు తరచూ కక్ష్య నుంచి అదుపుతప్పి భూవాతవరణంలోకి దూసుకొచ్చిన శకలాలు ప్రపంచ దేశాలను వణికించిన ఘటనలు మనకు తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భారత్‌ కాలం చెల్లిన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చి వేయడంపై కసరత్తు చేసి విజయం సాధించింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఇలాంటి ఉపగ్రహాలను పేల్చే సత్తా భారత్‌కు ఉన్నప్పటికీ.. అలా చేస్తే వీటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉన్నందున నియంత్రిత విధానంలో వాటిని నిర్వీర్యం చేయడంపై కసరత్తు చేసింది. ఇందుకు గాను తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే ‘మేఘ-ట్రోపికస్‌-1(ఎంటీ-1) ఉపగ్రహాన్ని ఎంచుకున్న ఇస్రో.. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మేఘ-ట్రోపికస్‌-1ను 2011 అక్టోబర్‌ 12న ఫ్రాన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ సీఎన్‌ఈసీతో కలిసి సంయుక్తంగా ప్రయోగించింది. ఉష్ణమండల వాతావరణ, పర్యావరణంపై  అధ్యయనానికి దీన్ని ఉపయోగించాయి.  వాస్తవానికి మూడేళ్లు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేస్తుందని తొలుత అంచనా వేశారు. కానీ, ఇది 2021 వరకు నిరంతరాయంగా సేవలు అందించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని