Corona: కేరళ నుంచి వస్తే.. 7రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి!

దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొవిడ్‌ కేసుల్లో దాదాపు సగానికి పైగా కొత్త కేసులు కేరళలోనే నమోదవుతుండటంతో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మరింత అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.......

Updated : 30 Aug 2021 20:22 IST

ప్రయాణికులపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు

బెంగళూరు: దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొవిడ్‌ కేసుల్లో దాదాపు సగానికి పైగా కొత్త కేసులు కేరళలోనే నమోదవుతుండటంతో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మరింత అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చిన ప్రయాణికులు ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ నుంచి వచ్చిన ప్రతిఒక్కరికీ(విద్యార్థులతో సహా) ఈ కొవిడ్‌ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయినా‌, ముందస్తు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నప్పటికీ క్వారంటైన్‌ పూర్తయిన ఏడో రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, క్వారంటైన్‌ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

కేరళలో తగ్గిన కొవిడ్‌ కేసులు 
మరోవైపు, కేరళలో సోమవారం కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల వ్యవధిలో 1.17లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 19,622 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 40.27లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 20,673కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం టెస్ట్‌ పాజిటివిటీ రేటు (TPR) 16.74శాతంగా ఉన్నట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. త్రిస్సూరులో అత్యధికంగా 3,177 కొత్త కేసులు రాగా.. ఎర్నాకుళంలో 2,315, కోలికోడ్‌లో 1,916 చొప్పున నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని