Marriage : పెళ్లి రోజే పరీక్ష.. నవ వధువు ఏం చేసిందంటే..!

కేరళకు చెందిన ఓ అమ్మాయికి తన పెళ్లి రోజే కళాశాలలో పరీక్ష ఉండటంతో పెళ్లికూతురిగా ముస్తాబై వెళ్లి పరీక్ష రాసింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Published : 13 Feb 2023 01:22 IST

(Image : Instagram)

తిరువనంతపురం : చదువు.. పెళ్లి.. రెండింటిలో ఏది ఎంచుకోవాలో తెలియక చాలా మంది అమ్మాయిలు సంఘర్షణ పడుతుంటారు. చదువుకుంటూ ఉంటే పెళ్లి ఆలస్యం అవుతుందని ఇంట్లోని పెద్దలు ఒత్తిడి చేస్తారు. పెళ్లి(Marriage) చేసుకుంటే చదువుకు పుల్‌స్టాప్‌ పడుతుందని అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. కానీ, ఓ కేరళ(Kerala) అమ్మాయి ఆ రెండింటికీ సమన్యాయం చేసేసింది. అంతే కాదండోయ్‌ పెళ్లి రోజే పరీక్ష ఉండటంతో నవ వధువుగా(bride) ముస్తాబై వెళ్లి మరీ పరీక్ష రాసి అందరి చేత ఔరా అనిపించింది. ఇప్పుడు ఆ యువతి వీడియోలు, ఫొటోలు నెట్టింట(Internet) చక్కర్లు కొడుతున్నాయి. 

కేరళకు చెందిన శ్రీలక్ష్మి అనిల్‌ బేథనీ నవజీవన్‌ కళాశాలలో ఫిజియోథెరపీ(Physiotherapy) చదువుతోంది. ఇంట్లో వారు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. అయితే సరిగ్గా పెళ్లి రోజే కళాశాలలో ఓ పరీక్ష రాయాల్సి వచ్చింది. దీంతో ఆమె పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఇంట్లో వారు, వరుడి కుటుంబీకుల ప్రోత్సాహంతో అటు నుంచి నేరుగా పరీక్ష రాయడానికి కళాశాలకు వెళ్లింది. పట్టుచీర, మెరిసే నగలు ధరించి కళాశాలకు వెళ్లిన ఆమెకు స్నేహితులు పలు విధాలా సహాయం చేశారు. కళాశాలకు వెళ్లగానే శ్రీలక్ష్మి అందరిలాగే ల్యాబ్‌ కోటు ధరించి తన పరీక్ష(exam) రాసేసింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నవ వధువు నిర్ణయాన్ని స్వాగతిస్తూ నెటిజన్లు హేట్సాఫ్‌ చెబుతున్నారు. పెళ్లి తరువాత కూడా చదువుకోవచ్చని.. ఎంతో మంది ఆడపిల్లలకు శ్రీలక్ష్మి స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడుతున్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని