Mahua Moitra: ‘మహువా’పై ఆరోపణల వ్యవహారం.. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి సిఫార్సు

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఫిర్యాదును స్పీకర్‌ ఓం బిర్లా.. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి సిఫార్సు చేశారు.

Published : 17 Oct 2023 15:51 IST

దిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రలకు పాల్పడినందుకుగానూ వెంటనే మహువాను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాజాగా స్పీకర్‌ ఓం బిర్లా ఈ ఫిర్యాదును లోక్‌సభ నైతిక విలువల కమిటీ (Lok Sabha Ethics Committee)కి సిఫార్సు చేశారు. ఈ కమిటీకి ప్రస్తుతం భాజపా సభ్యుడు వినోద్ కుమార్ సోన్‌కర్ అధ్యక్షత వహిస్తున్నారు.

అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొనేందుకు ఎంపీ మహువా మొయిత్రా.. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారంటూ నిషికాంత్‌ తన లేఖలో ఆరోపించారు. దీంతోపాటు మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్‌ వివరాలనూ (క్రెడెన్షియల్స్‌) ఇతరులకు అందజేసినట్లు తెలిసిందని, దానిపై దర్యాప్తు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కూ లేఖ రాశారు. అయితే, దుబే ఆరోపణలను మహువా ఇప్పటికే ఖండించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణ జరిగినా సిద్ధమేనన్నారు. దుబేతో పాటు ఓ న్యాయవాదికి లీగల్‌ నోటీసులు పంపించారు.

పార్లమెంటులో ప్రశ్నలకు మహువా డబ్బు తీసుకున్నారు

ఇదిలా ఉండగా.. ‘నైతిక విలువల కమిటీ’ని లోక్‌సభలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళిని, అమలు తీరును పర్యవేక్షిస్తుంది. సభ్యులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడంతోపాటు వారిపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని