Mahua Moitra: బహిష్కరణ వేటుపై సుప్రీంలో సవాల్‌ చేసిన మహువా మొయిత్రా

తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. సభ నుంచి బహిష్కరించడాన్ని తృణమూల్ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా(Mahua Moitra) సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. 

Updated : 11 Dec 2023 17:22 IST

దిల్లీ: లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ(TMC) నేత మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన లోక్‌సభ ఎంపీ పదవిపై విధించిన బహిష్కరణను అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. 

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది.

ఎథిక్స్ కమిటీ నివేదికను గతవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. ఆమోదం లభించింది. దాంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని