Manish sisodia: సిసోదియాను మానసికంగా టార్చర్‌ చేస్తున్నారు.. ఆప్‌

లిక్కర్‌ స్కాం(Delhi liquor scam) కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు మెంటల్‌గా టార్చర్‌ పెడుతున్నారని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

Published : 05 Mar 2023 18:40 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam) కేసులో అరెస్టయిన సీబీఐ కస్టడీలో ఉన్న తమ పార్టీ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా(Manish sisodia)ను మానసికంగా టార్చర్‌ పెడుతున్నారని ఆప్‌(AAP) ఆరోపిస్తోంది. తప్పుల్ని అంగీకరించేలా సంతకాలు చేయాలని సీబీఐ అధికారులు బలవంతం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ దిల్లీలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడారు. గత ఆరు రోజులుగా సీబీఐ రిమాండ్‌లో ఉన్న సిసోదియాను మానసికంగా హింసిస్తున్నట్టు తమకు సమాచారం అందిన విషయాన్ని వెల్లడించారు. దీనిపై నిన్ననే తన న్యాయవాది ద్వారా సిసోదియా సూచించారన్నారు. పేద పిల్లల చదువుల కోసం ఎంతో కృషిచేస్తున్న ఇలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇస్తున్నాం.. సంతకం పెట్టండి అంటూ ఒత్తిడిచేస్తున్నారని మండిపడ్డారు. సిసోదియాకు వ్యతిరేకంగా ఒక్క రూపాయికి కూడా సీబీఐ వద్ద ఆధారాల్లేవని.. అందుకే చిత్రహింసలకు గురిచేయడం ద్వారా తప్పుల్ని ఒప్పుకొనేలా ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆయన ఇంటిపై దాడులు చేసినా ఏమీ దొరకలేదన్నారు. 

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలపై గత ఆదివారం సీబీఐ అధికారులు సిసోదియాను దిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిన్న ఆయన కోర్టుకు హాజరైన సందర్భంగా సీబీఐ అధికారులు ఏడెనిమిది గంటలు ఒకేచోట కూర్చోబెట్టి అడిగిన ప్రశ్నల్నే పదే పదే అడుగుతున్నారన్నారు. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ జడ్జికి తెలిపారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. సిసోదియాపై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించరాదని; అడిగిన ప్రశ్నల్నే మళ్లీ అడగవద్దని ఆదేశించారు. ఏదైనా కొత్త విషయం ఉంటేనే ఆయన్ను అడగాలన్నారు. ఇదిలా ఉండగా.. తమ దర్యాప్తునకు సహకరించడంలేదంటూ సీబీఐ ఆరోపిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని