వలస కూలీకి ₹75 లక్షల జాక్‌పాట్‌.. పోలీస్‌ స్టేషన్‌కు పరుగు!

లాటరీలో ₹75లక్షల జాక్‌పాట్‌ తగిలిన ఓ వలస కూలీ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు పరుగెత్తుకొని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

Published : 17 Mar 2023 21:15 IST

ఎర్నాకులం: ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని కేరళకు వచ్చిన ఓ వలస కూలీకి జాక్‌పాట్‌ తగిలింది. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. ఎస్‌కే బాదేశ్‌ అనే వ్యక్తికి రూ.75లక్షలు లాటరీ తగలగా.. అతడు ఆనందంలో ఉబ్బితబ్బుబ్బయ్యాడు. తన టికెట్‌కు లాటరీ తగిలిందన్న ఆనందం ఓ వైపు.. ఆ టికెట్‌ను ఎవరైనా కాజేస్తారేమోన్న భయం ఇంకోవైపు వెంటాడటంతో ఏం చేయాలో తెలీక నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌కే బాదేశ్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం కేరళకు వచ్చాడు.  ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు కేరళకు వచ్చి ఎన్నో సంవత్సరాలు కాలేదు.. అతడికి మలయాళం కూడా తెలియదు. తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న బాదేశ్‌.. ఎప్పటిలాగే కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్త్రీశక్తి లాటరీ వద్ద టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ టికెట్‌పై మంగళవారం రాత్రి ఏకంగా రూ.75 లక్షల లాటరీ తగలడంతో అతడి ఆనందానికి హద్దుల్లేవు. తన టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలిన విషయం తెలియగానే మువట్టుపుఝా పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. పోలీసులను ఆశ్రయించిన బాదేశ్‌.. తనకు వచ్చిన ప్రైజ్‌ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు. లాటరీ డబ్బులు క్లెయిమ్‌ చేసుకొనే లాంఛనాలు తెలియకపోవడంతో పాటు ఎవరైనా తన నుంచి ఆ టికెట్‌ను లాక్కుంటారేమోనన్న భయంతో అతడు తమ సాయం కోరి వచ్చాడని కేరళ పోలీసులు తెలిపారు. 

బాదేశ్‌ ఆందోళనను అర్థం చేసుకున్న పోలీసులు.. అతడికి లాటరీకి సంబంధించిన విధివిధానాలు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.  బాదేశ్ ఇంతకముందు కుడా చాలా సార్లు లాటరీ టికెట్లు కొని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఎప్పుడూ తగలలేదు. ఈసారైనా తనను అదృష్టం వరించాలన్న అతడి ఆశలు ఫలించడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు. లాటరీ డబ్బులు చేతికందాక బెంగాల్‌లోని తన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు బాదేశ్ తెలిపాడు. అంతేకాకుండా కేరళలో వరించిన అదృష్టంతో తన ఇంటి మరమ్మతులు చేపట్టడంతో పాటు తన వ్యవసాయాన్ని విస్తరించనున్నట్టు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని