Online Payments: దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు..!

దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 24 Apr 2022 14:37 IST

చిన్నచెల్లింపులే పెద్ద ఆర్థికవ్యవస్థకు ఊతం ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ

దిల్లీ: దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవి కేవలం సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. చిన్న ఆన్‌లైన్‌ చెల్లింపులే పెద్ద డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్న మోదీ.. ఈ క్రమంలో కొత్తగా ఎన్నో ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు వస్తున్నాయని అన్నారు. ప్రతినెల చివరి ఆదివారం నాడు దేశప్రజలనుద్దేశించి నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ ఈ విధంగా ప్రసంగించారు.

‘దేశవ్యాప్తంగా ప్రతిరోజు రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం ఒక్క మార్చి నెలలోనే యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవి కేవలం సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా నిజాయితీ గల వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయన్న మోదీ.. డిజిటల్‌ చెల్లింపులు, స్టార్టర్‌కు సంబంధించిన సొంత అనుభవాలను ఇతరులతోనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా పంచుకునే స్వీయ అనుభవాలే దేశంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సూచించారు.

ఇక ఏప్రిల్‌ 14న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతో మంది లేఖలు, మెసేజ్‌లు పంపిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రుల సేవలకు గుర్తుగా వారిని స్మరించుకునేందుకు 75వ స్వాతంత్ర్య వేడుకలకు మించి మరో మంచి సమయం లేదన్నారు. ఇక క్రీడల్లో మాదిరిగా ఆర్ట్స్‌, విద్యారంగంతో పాటు ఇతర రంగాల్లో దివ్యాంగులు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని మోదీ గుర్తుచేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని దివ్యాంగులు ఉన్నత శిఖరాలను సాధించగలుగుతున్నారంటూ వారిని ప్రశంసించారు. ఇక మే నెలలో వచ్చే పండుగల సందర్భంలో ప్రజలు తప్పకుండా కొవిడ్‌ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని