గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్‌ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్‌లో ఇప్పటికే 9 మంది ప్రాణాలు

Published : 18 Dec 2020 11:22 IST

అహ్మదాబాద్‌లో 9 మంది మృతి

(ప్రతీకాత్మక చిత్రం)

అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్‌ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్‌లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌తో పాటు దిల్లీ, ముంబయిలోనూ ఈ వ్యాధి కేసులు బయటపడుతున్నట్లు సమాచారం.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు 44 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో 12 కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధికి గురైనవారంతా 50ఏళ్ల పైబడినవారే. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కన్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లోత్‌ కూడా మ్యూకోర్మైకోసిస్‌ గురించి చెబుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం గమనార్హం. ‘కొవిడ్‌ 19 నుంచి కోలుకుంటున్నవారు మ్యూకోర్మైకోసిస్‌ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని వల్ల శరీరంలో మొదడుతో పాటు పలు అవయవాలు పనిచేయకుండా పోతాయి. ముంబయి, అహ్మదాబాద్‌ నగరాల్లో ఇప్పటికే దీనిపై హెచ్చరికలు చేశారు’ అని గెహ్లోత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఏంటీ మ్యూకోర్మైకోసిస్‌..

ఈ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్‌ అనేవారు. అత్యంత అరుదైన ఈ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ చాలా ప్రమాదకరమైనది. మ్యూకోర్మైసెటీస్‌ అనే శిలీంధ్రం కారణంగా ఈ ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. తొలుత ముక్కు నుంచి ప్రారంభమై.. కళ్లకు సోకుతుంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం వల్ల దీని నుంచి బయటపడొచ్చు. లేదంటే ప్రాణాంతకంగా మారుతుంది. ఇన్ఫెక్షన్‌ కళ్లను చేరిన తర్వాత కంటి చుట్టూ ఉండే కండరాలు పనిచేయకుండా పోతాయి. ఫలితంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. ఇక మెదడును చేరితే.. ఆ రోగి మెదడువాపు‌ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.  

ఇవీ చదవండి..

కరోనా: 95లక్షల మంది కోలుకున్నారు

వ్యాక్సిన్‌ ఇలా ఇస్తే ఉత్తమం: ఆక్స్‌ఫర్డ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని