పుణెలో హోటళ్లు బంద్‌.. రాత్రి కర్ఫ్యూ

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌

Updated : 02 Apr 2021 17:36 IST

పుణె: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహాప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు. శనివారం నుంచి వారం రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావ్‌ వెల్లడించారు. 

హోటళ్లు మూసివేత..

ఏప్రిల్‌ 3 నుంచి వారం రోజుల పాటు పుణె వ్యాప్తంగా బార్లు, హోటళ్లు, రెస్టారంట్లు మూతబడుతాయని సౌరభ్‌ తెలిపారు. అయితే, హోం డెలివరీలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా ఎలాంటి ఫంక్షన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. అంత్యక్రియల్లో 20 మంది, వివాహాల్లో 50 మంది మాత్రమే పాల్గొనాలని చెప్పారు. ఏప్రిల్‌ 9వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటానమి సౌరభ్‌ తెలిపారు. 

రాత్రి సీఎం ఠాక్రే ప్రసంగం..

రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేడు ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఆయన ప్రసంగం చేయనున్నట్లు ముంబయి మేయర్‌ కిశోరీ పడ్నేకర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు చాలా మంది సుముఖంగా లేరని, అయితే పరిస్థితుల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించక తప్పలేదని ఆమె అన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని