Winter Olympics: వింటర్‌ ఒలింపిక్స్‌ ఏర్పాట్ల జోరు.. వేల సిబ్బంది బబుల్‌లోకి!

కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తూ.. చైనా ప్రభుత్వం స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జియాన్‌, యనాన్‌ నగరాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా మూడు అసింప్టమేటిక్‌ కేసులు బయటపడటంతో హెనాన్‌ ప్రావిన్స్‌లోని...

Published : 04 Jan 2022 23:30 IST

బీజింగ్‌: కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తూ.. చైనా ప్రభుత్వం స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జియాన్‌, యనాన్‌ నగరాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా మూడు అసింప్టమేటిక్‌ కేసులు బయటపడటంతో హెనాన్‌ ప్రావిన్స్‌లోని యుజౌ నగరంలో 10 లక్షల మందిని ఇళ్లకు పరిమితం చేసింది. మరోవైపు వింటర్‌ ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. తాజాగా.. క్రీడా వేదికలు, రవాణా, సిబ్బంది నిర్వహణ పనులు మొదలుపెట్టింది. వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకుగానూ.. మంగళవారం వేలకొద్ది సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు తదితరులను క్లోజ్డ్ లూప్‌(బబుల్‌)లో ప్రవేశపెట్టింది. కొన్ని వారాలపాటు వారు అందులోనే ఉండనున్నారు. చైనాలో ఫిబ్రవరి 4- 20 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే.

బీజింగ్‌లో అడుగుపెట్టనున్న దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తదితరులూ బబుల్‌ ఉండనున్నారు. రోజూ వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వింటర్‌ ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లు కొలిక్కి వచ్చినట్లు ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ మీడియా విభాగాధిపతి జావో విడాంగ్ వెల్లడించారు. క్రీడా వేదికలు, హోటళ్లు, రవాణా అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వేదికలు బీజింగ్‌ వెలుపల ఉండటంతో.. రాకపోకలకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, చైనాలోని విదేశీ దౌత్యవేత్తలు మాత్రం.. ఒలింపిక్స్‌ విషయంలో ప్రభుత్వ ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయని వాపోతున్నారు! ఇలాగైతే బబుల్‌లోని తమ జాతీయులకు సరైన సాయం అందించలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని