Omicron: దిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా..?

దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి మరోసారి కలవరపెడుతోంది. పాజిటివిటీ రేటు కూడా ఐదు శాతానికి మించింది.

Published : 22 Apr 2022 01:24 IST

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాలు ఏం చెబుతున్నాయంటే

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి మరోసారి కలవరపెడుతోంది. పాజిటివిటీ రేటు కూడా ఐదు శాతానికి మించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రాబల్యానికి గల కారణాలను అన్వేషించేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ముమ్మరం చేశారు. ఏప్రిల్‌ తొలి రెండు వారాల్లో నమోదైన పాజిటివ్‌ నమూనాల్లో ఒమిక్రాన్‌ ఉపరకమైన ‘బీఏ.2.12’ వేరియంట్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దిల్లీలో కరోనా వ్యాప్తి పెరుగుదలకు ఈ వేరియంట్‌ కారణంగా భావిస్తున్నారు.

దిల్లీలో ఇటీవల పెరుగుతోన్న కేసులకు సంబంధించి ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ తొలి పదిహేను రోజుల్లో 300లకుపైగా నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేపట్టింది. 52శాతం నమూనాల్లో బీఏ.2.12 ఉపరకం వెలుగు చూడగా, 11శాతం నమూనాల్లో బీఏ.2.10 కనిపించినట్లు తేలింది. 60శాతానికిపైగా ఉన్న ఈ రెండు ఉపరకాల వల్లే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఒమిక్రాన్‌ (బీఏ.2)తో పోలిస్తే బీఏ.2.12 ఉపరకం 30 నుంచి 90శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. మరోవైపు మొత్తం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టిన నమూనాల్లో కరోనా ఒమిక్రాన్‌ నుంచి ఉత్పన్నమైన మరో కొత్తరకం ‘బీఏ.2.12.1’ కూడా కనిపించినట్లు సమాచారం. ఇటీవల అమెరికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ వేరియంట్‌ను ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.

ఇదిలాఉంటే, దిల్లీలో బుధవారం ఒక్కరోజు 1009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందురోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 60శాతం పెరిగింది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఇలా అనూహ్యంగా కేసుల పెరుగుదల కారణాలను విశ్లేషిస్తోన్న అంటువ్యాధుల నిపుణులు.. ఆర్‌ విలువ (పునరుత్పత్తి) గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, చేతుల పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల వల్ల మరోసారి వైరస్‌ ఉద్ధృతికి కారణంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని