Intelligence alert: భారత్‌లో రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర..!

భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు

Published : 23 May 2022 12:04 IST

హెచ్చరించిన నిఘా వర్గాలు

దిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పథకం రచించినట్లు హెచ్చరించాయి.

పంజాబ్‌ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు ఐఎస్‌ఐ ముఠా సభ్యులు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. రైల్వే ట్రాక్‌లపై దాడులు చేపట్టేందుకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్‌లోని పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఆఫర్‌ చేస్తున్నట్లు హెచ్చరించాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఓ ఇన్నోవా వాహనంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పలు రాష్ట్రాలకు తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఆర్‌డీఎక్స్‌ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్‌ క్యాటరిడ్జ్‌లతో పాటు రూ.1.30 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్‌ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని