New Parliament Building: కాంగ్రెస్‌ నేతలూ.. ఆ విషయాన్ని మర్చిపోవద్దు: హర్దీప్ సింగ్ పూరి

కాంగ్రెస్ (Congress) పార్టీలో జాతీయవాదం లేదని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి (Hardeep Singh Puri) విమర్శించారు. దేశాభివృద్ధిని ఆ పార్టీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

Published : 23 May 2023 22:04 IST

దిల్లీ: నూతన పార్లమెంట్‌ భవనం (New Parliament Building) ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి (Hardeep Singh Puri) విమర్శించారు. గతంలో మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్‌ గాంధీ సైతం పార్లమెంట్‌లో కొన్ని సముదాయాలను ప్రారంభించారని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ (Congress) నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. మే 28న ప్రధాని మోదీ (PM Narendra Modi) నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తారని కొద్ది రోజుల క్రితం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ప్రధాని ప్రారంభిస్తారనడంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం చెబుతుండటాన్ని హర్దీప్‌సింగ్‌పూరీ తప్పుబట్టారు.

‘‘కాంగ్రెస్‌ నేతలు తమ ఆరోపణలను సమర్థించుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను వెతికే బదులు, ఇంతటి గొప్ప కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనేందుకు ఎందుకు ఆసక్తి చూపలేకపోతున్నారు? ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నిర్మాణానికి దేవాలయంగా భావించే నూతన పార్లమెంట్‌ భవనం ఏర్పాటును ఎందుకు హర్షించలేకపోతున్నారు? గతంలో రాష్ట్రపతి గురించి ఆ పార్టీ నాయకులు అనాలోచిత వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు రాష్ట్రపతిని గౌరవించడంలేదని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అక్టోబరు 24, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంట్‌ అనెక్స్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1987 ఆగస్టు 15న నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ పార్లమెంట్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ విషయాలను కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దు. కాంగ్రెస్‌ పార్టీలో జాతీయవాదం లేదు. దేశాభివృద్ధిని ఆ పార్టీ ఓర్వలేకపోతుంది’’ అని మంత్రి విమర్శించారు. 

నూతన పార్లమెంట్‌ భవనానికి 2020లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శంకుస్థాపన చేశారు. అయితే, ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములను ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. భాజపా-ఆరెస్సెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రపతి కార్యాలయం నామామాత్రంగా మిగిలిపోయిందని ఎద్దేవాచేశారు. ఆర్టికల్‌ 60, 111 ప్రకారం పార్లమెంట్‌కు రాష్ట్రపతి అధిపతిగా ఉంటారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ సైతం ట్వీట్ చేశారు. రాహుల్‌ గాంధీ కూడా పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మునే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బదులుగా ప్రధాని మోదీని ఆహ్వానించడం రాష్ట్రపతిని అవమానించడమేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విమర్శించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని