PFI: నిషేధం తర్వాత.. పీఎఫ్‌ఐపై చర్యలు ఇలా..!

నిషేధం నేపథ్యంలో పీఎఫ్‌ఐ సంస్థలకు చెందిన ఆస్తుల స్వాధీనం, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం, జైలు శిక్ష వంటి చర్యలు ఉండనున్నాయి.

Published : 29 Sep 2022 01:25 IST

కోర్టుకు వెళ్లే యోచనలో నిషేధిత సంస్థ సభ్యులు

దిల్లీ: ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (PFI)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఎన్ఐఏ దేశవ్యాప్త దాడుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నిషేధం నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు సంస్థలు పలు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఇందులో ఆస్తుల స్వాధీనం, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం, జైలు శిక్ష వంటి చర్యలు ఉండనున్నాయి.

ప్రస్తుతానికి పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. దీన్ని మరింత కాలం పొడిగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. నిషేధం నేపథ్యంలో పీఎఫ్‌ఐ సభ్యులు ఆ సంస్థకు దూరంగా ఉంటున్నట్లు డిక్లరేషన్‌ ప్రకటించాలి. అలా కాకుండా సంస్థతో సంబంధాలు కొనసాగిస్తే వారిపై రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశమున్నట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం నిషేధిత సంస్థ నిధులను చూసుకునే సభ్యులు ఎలాంటి లావాదేవీలు చేసేందుకు వీలుండదు. ఏదైనా ఒక సంస్థను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటిస్తే.. ఆ సంస్థ కార్యాలయాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.

నిషేధంపై సుప్రీంకోర్టుకు..

ఇదిలా ఉండగా.. పీఎఫ్‌ఐపై నిషేధం వ్యవహారం కోర్టుకు చేరనుంది. కేంద్రం నిర్ణయం ‘అప్రజాస్వామికం’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అని పీఎఫ్‌ఐ విద్యార్థి విభాగం ఆరోపించింది. దీన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని