Arvind Kejriwal: గుజరాత్‌లో కేజ్రీవాల్‌పై బాటిల్‌తో దాడి?

గుజరాత్‌ పర్యటనలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దిశగా గుర్తు తెలియని దుండగుడు ఒకరు బాటిల్‌ విసిరారు. అయితే, అది ఆయన్ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిగా కనిపిస్తున్నప్పటికీ.. దాన్ని తాము ధ్రువీకరించలేమని ఆప్‌ నాయకులు తెలిపారు.

Updated : 02 Oct 2022 15:24 IST

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జరిగిన గర్బా కార్యక్రమంలో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను విసిరారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు ఆదివారం తెలిపారు. అయితే అది ఆయనకు తగలలేదని, తలపై నుంచి వెళ్లి పక్కకు పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే, ఆయన్ని లక్ష్యంగా చేసుకొని విసిరారా? లేక అనుకోకుండా ఎవరైనా ఖాళీ బాటిల్‌ను విసరడంతో అది అటుగా వచ్చి పడిందా? తెలియలేదు. 

గర్బా కార్యక్రమంలో కేజ్రీవాల్‌ అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి బాటిల్‌ను విసరగా అది కేజ్రీవాల్‌ మీదుగా వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘‘బాటిల్‌ను కొంత దూరం నుంచి విసిరారు. అది కేజ్రీవాల్‌ తల మీది నుంచి వెళ్లింది. అది ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విసిరినట్లు అనిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని మేం కచ్చితంగా నిర్ధారించలేం. పోలీసులను సంప్రదించాల్సిన అవసరం లేదు’’ అని ఆప్‌ మీడియా సమన్వయకర్త సుకన్‌రాజ్‌ తెలిపారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి కేజ్రీవాల్‌ గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. శనివారం రాత్రి రాజ్‌కోట్‌లో బస చేసిన వాళ్లు.. అదే నగరంలో జరుగుతున్న రెండు వేర్వేరు గర్బా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు వారివురు కలిసి సురేంద్రనగర్‌, ఖేడ్‌బ్రహ్మ ప్రాంతాల్లో జరగనున్న రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని