మోదీ అసహనం.. సారీ చెప్పిన కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. 

Updated : 23 Apr 2021 18:07 IST

సమావేశం ప్రత్యక్ష ప్రసారంపై వివరణ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. 

ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్‌ ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ‘కొవిడ్‌పై పోరాడేందుకు జాతీయ ప్రణాళిక ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకెళ్లగలవు’ అంటూ ఆయన మాట్లాడుతుండగా, వెంటనే ప్రధాని కల్పించుకుని..‘ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారు. ఇది సముచితం కాదు. మనం సంయమనం పాటించాలి’ అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి మందలించారు. కాగా, దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రధానిని క్షమించమని కోరారు. జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఆ తరవాత కేజ్రీవాల్ తాను మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగించారు.

ఇలా ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కేజ్రీవాల్‌ను తప్పుపట్టాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ‘ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో..మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. రహస్య సమాచారం లేని ప్రజా ప్రాముఖ్యత ఉన్న విషయాలు ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలున్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని వివరణ ఇచ్చింది. 

అంతకుముందు కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘సర్ మాకు మీ మార్గదర్శకత్వం కావాలి. దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ లేకపోతే దిల్లీ వాసులకు ప్రాణవాయువు లభించదా? దిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేరే రాష్ట్రంలో నిలిపివేస్తే..దాన్ని రప్పించేందుకు నేను కేంద్రంలో ఎవరిని సంప్రదించాలో చెప్పండి. దిల్లీకి చేరకుండా పెద్ద ఎత్తున ట్యాంకర్లు నిలిపివేస్తోన్న రాష్ట్రాల విషయంలో కల్పించుకోండి. ప్రధానిజీ..మీరు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడండి. అప్పుడే రాజధానికి ఆక్సిజన్ చేరుకుంటుంది’ అని కేజ్రీవాల్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దిల్లీ ఆసుపత్రుల్లో కొరతను తీర్చేందుకు పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా నుంచి ఆకాశమార్గాన ఆక్సిజన్‌ను తరలించే వీలు కల్పించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని కోరారు. సైన్యం సహకారంతో కేంద్రం అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను స్వాధీనం చేసుకోవాలని, రవాణా సమయంలో ప్రతి ట్రక్కుతో పాటు ఆర్మీ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ సూచించారు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం కావడం చర్చకు దారి తీసింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని