Serum: స్పుత్నిక్‌ తయారీకి గ్రీన్‌సిగ్నల్‌!

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు మార్గం సుగమమైంది.

Published : 04 Jun 2021 22:06 IST

పుణె: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు మార్గం సుగమమైంది. స్పుత్నిక్‌ తయారీ కోసం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక అనుమతి వచ్చినట్లు సీరం కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో స్పుత్నిక్‌ టీకా పరీక్ష, విశ్లేషణ అనంతరం డోసుల తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది.

‘స్పుత్నిక్‌ తయారీకి ప్రాథమికంగా అమోదం లభించింది. కానీ, వ్యాక్సిన్‌ తయారీకి కొంతకాలం పడుతుంది. ఆ లోపు కొవిషీల్డ్‌తో పాటు కొవావాక్స్‌ (నోవావాక్స్‌ కంపెనీ టీకా) టీకాలపై దృష్టి సారిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధికార ప్రతినిధి మీడియాకు పేర్కొన్నారు.

దేశంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు తయారీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ నెలలో 10కోట్ల కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రానికి వెల్లడించింది. వీటితో పాటు అమెరికాకు చెందిన నోవావాక్స్‌ డోసులను భారీ సంఖ్యలో అందుబాటులోకి తేనుంది. అయితే, ఇందుకు అమెరికా నియంత్రణ సంస్థల క్లియరన్స్‌ కోసం వేచి చూస్తోంది. తాజాగా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను కూడా తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధమవుతోంది.

ఇక రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు, సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి ఏప్రిల్‌ నెలలోనే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. జులై నుంచి భారత్‌లోనే తయారు కానుంది. అంతలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌ డోసులు దిగుమతి అవుతున్నాయి. తొలి దశలో 1.5లక్షల డోసులు, రెండో విడతలో 60వేల డోసులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో దాదాపు 30లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ మే 14 ప్రారంభం కాగా.. దాదాపు 65 దేశాల్లో పంపిణీ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని