Food emergency: శ్రీలంకలో ఆహార సంక్షోభం.. ఇదే కారణం

ఆహారపదార్థాల కొరత కారణంగా శ్రీలంకలో మంగళవారం ఫుడ్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. బియ్యం, చక్కెర, ఇతర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొనేందుకు వాటి నిల్వల విషయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కఠిన నిబంధనలు జారీ చేశారు...

Updated : 12 Sep 2022 11:13 IST

కొలంబో: ఆహారపదార్థాల కొరత కారణంగా శ్రీలంకలో మంగళవారం ఆహార సంక్షోభం ప్రకటించారు. బియ్యం, చక్కెర, ఇతర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొనేందుకు వాటి నిల్వల విషయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కఠిన నిబంధనలు జారీ చేశారు. అక్రమంగా నిల్వ చేసేవారికి జరిమానాలు పెంచారు. సరకుల సరఫరాను సమన్వయం చేయడానికి ఆర్మీ ఉన్నతాధికారిని నియమించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా చక్కెర, బియ్యం, ఉల్లి, ఆలూ తదితర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పాలు, కిరోసిన్‌, వంట గ్యాస్‌ కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరారు.

ఎందుకు ఈ దుస్థితి?

2.10 కోట్ల జనాభా కలిగిన శ్రీలంక కరోనాతో కుదేలైంది. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మరోవైపు స్థానిక బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక వివరాల ప్రకారం.. 2019 నవంబరులో దేశంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు.. ఈ ఏడాది జూలై నాటికి 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అమెరికా డాలర్‌తో పోల్చితే శ్రీలంకన్‌ రూపీ విలువ 20 శాతానికి పైగా పడిపోయింది. దీంతో దిగుమతులపై ప్రభావం పడింది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసే క్రమంలో గత ఏడాది మార్చిలోనే మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, ఇతరత్రావాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకపోయింది. ఔషధాలు, వ్యాక్సిన్‌ల కొనుగోలుకు విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఇంధన పొదుపు పాటించాలని సంబంధిత శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిలా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తామే లెక్కగట్టి పంపిణీ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని