NIA Raids: కశ్మీర్ హత్యలు, హెరాయిన్ పట్టివేత కేసులు.. దాడులు చేసిన ఎన్‌ఐఏ

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం 21 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. జమ్మూకశ్మీర్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల జమ్ము కశ్మీర్‌లో సామాన్య పౌరుల హత్యలు, గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

Updated : 22 Aug 2022 15:55 IST

21 ప్రాంతాల్లో సోదాలు

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం దేశంలోని 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇటీవల జమ్ము కశ్మీర్‌లో సామాన్య పౌరుల హత్యలు, గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్‌ఐఏతో పాటుగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఈ సోదాల్లో పాలుపంచుకున్నారు. ఉగ్రవాద అనుకూల నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకొని జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడుల్ని నిర్వహించారు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్ ముజాహిదీన్, అల్‌ బదర్ వంటి ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌ల అణచివేత  లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు సంస్థ ఒక  ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో కశ్మీర్‌లో మైనార్టీలు, స్థానికేతరులైన ఏడుగురు సాధారణ పౌరులను ఉగ్రవాదులు హత్య చేయడం తీవ్రంగా కలవరపర్చింది. మరోపక్క నిన్న జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఘటనలో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

అలాగే కొద్ది రోజుల క్రితం ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసు కూడా ఎన్‌ఐఏకి చేరింది. దాని దర్యాప్తులో భాగంగా దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఐదు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది. ఈ భారీ పట్టివేతకు సంబంధించి శనివారం చెన్నై, కొయంబత్తూర్, విజయవాడలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని