Vaccination: 16% మందికి రెండు డోసులు పూర్తి..

కరోనా మూడో దశ ముప్పు పొంచిఉన్న వేళ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల రెండుసార్లు 24 గంటల వ్యవధిలో కోటి డోసులకు పైగా

Updated : 23 Feb 2024 16:16 IST

దిల్లీ: కరోనా మూడో దశ ముప్పు పొంచిఉన్న వేళ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల రెండుసార్లు 24 గంటల వ్యవధిలో కోటి డోసులకు పైగా పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా.. 16శాతం మంది అర్హులైన జనాభాకు రెండు డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఇక 54శాతం మందికి ఒక డోసు పూర్తయినట్లు తెలిపింది. 

సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో, దాద్రా నగర్‌ హవేలీ కేంద్రపాలితప్రాంతంలో 100శాతం మంది(18ఏళ్లు పైబడినవారు) కనీసం ఒక డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఒక్క ఆగస్టులోనే దేశవ్యాప్తంగా 18.38కోట్ల డోసులను పంపిణీ చేశామని సగటున రోజుకు 59.29లక్షల మంది టీకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. 

ఒక్క కేరళలోనే లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ ఒక్క కేరళలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70శాతం ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. క్రియాశీల కేసులు కూడా ఇక్కడే గణనీయంగా ఉన్నాయని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దేశంలో మొత్తం 3.8లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. ఒక్క కేరళలోనే లక్షకు పైగా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో 10000 - లక్ష మధ్యలో యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు 10వేల లోపే ఉన్నట్లు తెలిపారు. ఇక జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా 279 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వెలుగుచూడగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గినట్లు పేర్కొన్నారు. 

రెండో దశ ముగిసిపోలేదు.. నిబంధనలు మరవొద్దు..

దేశంలో రెండో దశ ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. టీకాలు వేసుకున్నా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. సమూహ కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని, ఒకవేళ అలా చేయాల్సి వస్తే అందులో పాల్గొనేవారంతా కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలని తెలిపారు. పండగలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని