Vaccination: మూడో డోసు ఎంతమంది కావాలంటున్నారో తెలుసా?

దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల మార్కును దాటిన వేళ.. మూడో డోసు గురించి వార్తలు వస్తున్నాయి. దాదాపు 61 శాతం మంది ప్రజలు( అర్హులు) మూడో డోసువైపు మొగ్గు చూపుతున్నారని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. కొవిడ్ నుంచి మరికొంతకాలం రక్షణ పొందేందుకు కొన్ని దేశాలు ఇప్పటికే మూడో డోసు ఇస్తోన్న సంగతి తెలిసిందే.

Published : 21 Oct 2021 23:35 IST

దిల్లీ: దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల మార్కును దాటిన వేళ.. మూడో డోసు గురించి వార్తలు వస్తున్నాయి. దాదాపు 61 శాతం మంది ప్రజలు( అర్హులు) మూడో డోసువైపు మొగ్గు చూపుతున్నారని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. కొవిడ్ నుంచి మరికొంతకాలం రక్షణ పొందేందుకు కొన్ని దేశాలు ఇప్పటికే మూడో డోసు ఇస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఆరునెలల్లో కరోనా టీకా మూడో డోసు అందుబాటులోకి వస్తే..తీసుకోవడానికి 61 శాతం మంది ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. మూడో డోసు అందుబాటులోకి వచ్చిన సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే తీసుకుంటామని మరో 27 శాతం మంది చెప్పారు. మరో 12 శాతం మందిలో కొందరు సంకోచం వ్యక్తం చేయగా, ఇంకొందరు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు. భారత్‌ వ్యాప్తంగా 301 జిల్లాల్లో 9,245 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు లోకల్‌సర్కిల్స్‌ వెల్లడించింది. వారిలో 68 శాతం మంది పురుషులు, 32 శాతం మంది స్త్రీలు ఉన్నారని తెలిపింది. అత్యధికులు టీకా మూడో డోసు తీసుకొని కొవిడ్ నుంచి రక్షణ పొందాలనుకుంటున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడవుతోంది. 

నేటికి భారత్ 100 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసింది. అందులో 74 శాతం మంది మొదటి డోసు, 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో మూడో డోసు గురించి సీరం ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ సైరస్ పూనావాలా స్పందించారు. కొవిడ్‌ నుంచి మరికొంతకాలం రక్షణ పొందేందుకు మూడో డోసు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని