
Omicron: బ్రిటన్‌ను వణికిస్తోన్న ఒమిక్రాన్.. ఒక్కరోజే 10వేల కేసులు..!
ఏడుకు చేరిన ఒమిక్రాన్ మరణాలు
లండన్: ఒమిక్రాన్ దాటికి బ్రిటన్ వణికిపోతోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. 24గంటల్లో 90వేల కొవిడ్ కేసులు బయటపడగా అందులో 10వేల కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ఒమిక్రాన్‌తో తొలి మరణం చోటు చేసుకున్న బ్రిటన్‌లో ప్రస్తుతం మరణాల సంఖ్య ఏడుకు చేరింది. శుక్రవారం రోజున 3201 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. మరుసటి రోజు ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. శనివారం ఒక్కరోజే 10,059 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కి పెరిగినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ (UKHSA) వెల్లడించింది.
కేసులు పెరిగినా.. అలాంటి పరిస్థితులు లేవ్..
ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో రోజువారీ కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 90,418 కేసులు నమోదయ్యాయి. ఇలా కొవిడ్ విజృంభణ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు. వారిచ్చే సమాచారం బట్టి కఠిన లాక్‌డౌన్ ఆంక్షలకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘గతకొన్ని రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడం చూసి తీవ్ర భయం కలిగింది. అయినప్పటికీ గతేడాది కొవిడ్ విజృంభణ సమయంలో ఆస్పత్రిలో చేరికలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్ అవసరమయ్యే కేసుల సంఖ్య తక్కువగానే ఉంది’ అని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటు వేల్స్‌లోనూ క్రిస్మస్ తర్వాత (27వ తేదీ నుంచి) పలు ఆంక్షలు విధించనున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉంటే, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ సరిపోదని ఇటీవల వెల్లడైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. బూస్టర్ ఇవ్వడం వల్ల రక్షణ మరింత పెరుగుతుందని చెబుతున్నాయి. అక్కడి జాతీయ ఆరోగ్య సర్వీస్ (NHS) ప్రకారం, ఇప్పటికే ఇంగ్లాండ్‌లో 60శాతానికిపైగా 40ఏళ్లు దాటిన పౌరులు బూస్టర్ డోసు తీసుకున్నారు. అయితే, ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తుండగా.. వీటిని వ్యతిరేకించేవారు కూడా తమ గళాన్ని పెంచారు. ముఖ్యంగా ప్రభుత్వం బలవంతంగా టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ కొందరు ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘యునైటెడ్ ఫర్ ఫ్రీడం మార్చ్’ పేరిట సెంట్రల్ లండన్‌లో వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.