Singhu Border: సింఘు సరిహద్దు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్య..!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సింఘు సరిహద్దు వద్ద దారుణం చోటుచేసుకుంది.

Updated : 15 Oct 2021 16:09 IST

ఆందోళన చేస్తోన్న రైతుల్లో కలవరం

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సింఘు సరిహద్దు వద్ద దారుణం చోటుచేసుకుంది. రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలోని ఓ వ్యక్తి (35) దారుణ హత్యకు గురయ్యారు. వేదికకు సమీపంలో ఉన్న బారికేడ్‌కు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. అయితే, మృతుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అతని మణికట్టును కత్తిరించి దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని కుండ్లీ పోలీసులు వెల్లడించారు.

దిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద రైతులు ఆందోళన చేస్తోన్న ప్రధాన వేదికకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఇది పంజాబ్‌, హరియాణాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు పోలీసులకు సహకరిస్తామని ఎస్‌కేఎం వెల్లడించింది.

ఇదిలాఉంటే, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తోన్న ఆందోళన 11 నెలలకు చేరింది. ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా రైతులు దిల్లీ సరిహద్దులో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ మహాపంచాయత్‌ పేరుతో భారీ సభలను నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సాగు చట్టాలను రద్దుచేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేస్తోన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని